గుంటూరులో పొంగిపోరలుతున్న డ్రెయిన్లు

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలోని పంట పొలాలు నీట మునిగి, చెరువులను తలపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో డ్రెయిన్లు పొంగడంతో బాపట్ల, పిట్టలవానిపాలెం, భట్టిప్రోలు మండలాల్లో దాదాపు 700 ఎకరాల్లో వెద పద్ధతిలో సాగు చేసిన వరి దెబ్బతింది. పంట పొలాల నుంచి నీరు బయటకు వెళ్లకపోవటంతో మొలక చనిపోయింది. పశ్చిమ డెల్టా ప్రాంతంలో వరి పంట పొలాలు నీట మునిగాయి. ఇలానే వర్షాలు కొనసాగితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు అందోళన చెందుతున్నారు. తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.గుంటూరు నగరంలో రోడ్లు బురదమయంగా మారాయి. యూజీడీ పనుల కోసం తవ్విన రహదారులు కనీసం నడవటానికి కూడా వీలు లేకుండా మారాయి. నగర శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున్న వర్షపు నీరు, మురికి నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. నానుడి వర్షానికి ప్రధాన రహదారులు సైతం గుంతలమయంగా మారడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌లో భారీగా వరద నీరు చేరుతుండటంతో, కుడికాలువ పరిధిలో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా వరుస కరువులతో రైతులు అల్లాడిపోయారు.అమరావతి, అచ్చంపేట, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరు నుంచి సచివాలయం వెళ్లే ప్రధాన రహదారి పెదపరిమి సమీపంలో కొట్టేళ్ల వాగు పొంగి రాకపోకలు స్తంభించాయి. రాయపూడి ప్రాంతంలో పాల వాగు పొంగి ప్రవహిస్తోంది. ఇక్కడ ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. కొండవీటి వాగుకు నీరు చేరుతుండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. వాగు ఉధృతి పెరిగితే సచివాలయం ప్రాంతం నీట మునుగుతుందని అధికారులు అందోళన చెందుతున్నారు. నీరుకొండ ప్రాంతంలో కొండవీటి వాగుకు భారీగా వరద వస్తోంది. తాడికొండ ప్రాంతంలో పత్తి, మినుము పంటలు 3 వేల ఎకరాల్లో నీట మునిగాయి. సచివాలయంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకే నీరు లీకేజై ఐదో అంతస్తులో పెచ్చులూడి కింద పడిపోయాయి.. అచ్చంపేట–అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజధాని భూములు చెరువులను తలపిస్తున్నాయి.ఖరీప్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 11.97 లక్షలుగా, ఇప్పటి వరకు 7.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి పంట 2.13 లక్షల ఎకరాలు, పత్తి సాధారణ వర్షపాతం 4.61 లక్షలు కాగా, ఇప్పటి వరకు 3.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయి. మిర్చి పంట సాధారణ సాగు విస్తీర్ణం 1.63 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 43, 685 ఎకరాల్లో మిర్చి పంట సాగైంది. పత్తి పంటకు బలం మందులు వేస్తున్నారు. వానలకు పొలాల్లో నీరు చేరింది. పంట పొలాలు ఉరకెత్తుతున్నాయి. పశ్చిమ డెల్టా ప్రాంతంలో వరి పంట పొలాలు నీట మునుగుతున్నాయి. .ఈ ఏడాది సైతం ఆరు తడి పంటలకే నీరు ఇస్తామని రైతుల ఆశలపై అధికారులు నీరు చల్లారు. ఈ ఏడాది ఆగస్టులోనే నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌కు వరద నీరు రావడం విశేషం. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు సాగర్‌ నీటి మట్టం 545.8 అడుగులు అంటే 200.623= టీఎంసీలు ఉండటం గమనార్హం. గత ఏడాది సాగర్‌లోకి 570 అడుగుల నీరు చేరినప్పటికి, సరైన ప్రణాళిక లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో కుడికాలువ పరిధిలో వరి పంటకు నీరివ్వలేదు. ఈ సారైనా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com