అత్యాశే…కొంప ముంచింది… తవ్వే కొద్ది కర్నూలు ఘటనలో కొత్త నిజాలు

కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధిలోని హత్తిబెళగల్ గ్రామ శివారులో రెండు రోజుల క్రితం సంభవించిన దుర్ఘటనకు అసలు కారణం ఓ భారీ కాంట్రాక్టేనని స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సిమెంటు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 110 కోట్లు విడుదల చేసి 3 నెలల్లో పూర్తి చేయాలని నిబంధన విధించినట్లు సమాచారం. తక్కువ సమయంలో సిమెంటు రహదారుల నిర్మాణం పూర్తి చేయాలంటే ఎక్కువ కంకర అవసరం అవుతుందని భావించిన క్వారీ యజమాని అందుకు తగ్గట్లుగా ఉత్పత్తి చేయడానికి ఒకేసారి పేలుడు సామగ్రి తెప్పించి నిల్వ ఉంచినట్లు గ్రామస్థుల ద్వారా తెలిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం క్వారీ యజమాని ఒక సారి 7 కిలోల జిలెటిన్ స్టిక్స్ మాత్రమే తెప్పించుకుని వినియోగించుకోవాలని అనుమతించినట్లు తెలుస్తోంది. అయితే గ్రామీణులు తెలిపిన మేరకు సుమారు 140 నుంచి 160 కిలోల జిలెటిన్ స్టిక్స్ నిల్వ చేశారని తెలిసింది. అంతేగాక క్వారీలో పని చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి నైపుణ్యం లేని కార్మికులను తీసుకురావడం, వారికి సరైన నివాస స్థలాలు చూపకపోవడంతో క్వారీ ప్రదేశంలోనే పేలుడు పదార్థాలు నిల్వ చేసిన గోదాముకు సమీపంలోనే వారు కూడా గుడారాలు వేసుకుని నివసిస్తున్నారని తెలిపారు. క్వారీలో మొత్తం 30 మంది పని వారు ఉండగా వారిలో 10 మంది సెలవుపై సొంత ప్రాంతాలకు వెళ్లగా మిగిలిన 20 మంది పని ముగించుకుని వంట చేసుకోవడానికి ఉపక్రమించగా వారిలో అయిదుగురు హత్తిబెళగల్ గ్రామానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న 15 మందిలో ముగ్గురు పేలుడు జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో కూర్చొని ఉన్నారని మిగిలిన వారు అక్కడే ఉన్నట్లు వెల్లడించారు. దాంతో పేలుడు ప్రమాదంలో 12 మంది మరణించారని పేర్కొంటున్నారు. కాగా ఈ దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన 8 మంది ఆ తరువాత ఎక్కడికి వెళ్లారో తెలియదని హత్తిబెళగల్ గ్రామస్థులు పేర్కొన్నారు. పేలుడు తీవ్రత కారణంగా క్వారీకి సమీపంలోని గ్రామస్థుల అనేక ఇళ్లు బీటలు వారాయి. గ్రామానికి, క్వారీకి మధ్య ఉన్న కొండ కారణంగా పేలుడు తీవ్రత తగ్గిందని లేదంటే గ్రామం మొత్తం నేలమట్టమైనా ఆశ్చర్యం లేదని వారు అభిప్రాయపడ్డారు. పేలుడు పదార్థాలు పెద్దఎత్తున నిల్వ చేసిన విషయం అధికారులకు కూడా సమాచారం ఉందని, అయితే వారెవరూ క్వారీ ప్రాంతంలో ఎలాంటి తనిఖీలు చేయలేదని మండిపడ్డారు. వారు తనిఖీ చేసి అధిక నిల్వలను స్వాధీనం చేసుకుని చర్యలు తీసుకుని ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేదని కాదని గ్రామీణులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *