దారి మళ్లుతున్న కుటుంబనియంత్రణ

0

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సి ఉండగా కోవెలకుంట్ల సీహెచ్‌సీలో కాసులిస్తే తప్ప చేయడం లేదు. వైద్య పరికరాల కొనుగోలు పేరుతో కొందరు ఉన్నత స్థాయి సిబ్బందే డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని, డబ్బు ఇవ్వకపోతే ఆపరేషన్‌ చేయకుండా వెనక్కి పంపుతున్నారని బాధితులు వాపోతున్నారు. కోవెలకుంట్ల, సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల ప్రజలకు వైద్య సేవలతోపాటు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు వీలుగా పట్టణంలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటైంది. ఆయా మండలాల్లోని బాలింతలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు ఆపరేషన్‌ థియేటర్‌ సౌకర్యం కూడా కల్పించారు. గతంలో సీహెచ్‌సీలో డాక్టర్‌ నాగరాజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించేవారు. 2015వ సంవత్సరంలో ఆయన ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆపరేషన్‌ థియేటర్‌ మూత పడింది. దీంతో ఆయా మండలాల బాలింతలు నంద్యాల, ఆళ్లగడ్డ, కర్నూలు, బనగానపల్లె పట్టణాలకు వెళ్లి ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చేది. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీ నుంచి ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను పునరుద్ధరించారు. రెండు నెలల కాలంలో 45 మందికి ఆపరేషన్లు చేశారు. పట్టణంలోని సీహెచ్‌సీలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది కు.ని. ఆపరేషన్లకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. రూ. 2500 ఇవ్వాలని, లేని పక్షంలో అంతే విలువ చేసే బీపీ మిషన్, ఇతర వైద్య పరికరాలు కొనుగోలు చేసి తీసుకురావాలని చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇవేవీ ఇవ్వని పక్షంలో ఏదో సాకుతో ఆపరేషన్లు చేయకుండా వెనక్కి పంపుతున్నారని వాపోతున్నారు. నిరు పేద కుటుంబాలు అంత మొత్తం ఇచ్చుకోలేక ఆపరేషన్లు చేయించుకోకుండా వెనుదిరిగి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఆపరేషన్ల వ్యహరంపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు

Share.

About Author

Leave A Reply