25న కర్నూలులో ధర్మపోరాట దీక్ష

రైతు రుణ ఉపశమన అర్హత పరిష్కార వేదికల ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 9 లక్షల ఫిర్యాదులు స్వీకరించి రూ.680 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 25న కర్నూలులో జరగనున్న ధర్మపోరాట దీక్ష సభ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో కలిసి పాల్గొన్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో రైతు రుణ ఉపశమన అర్హత పరిష్కార వేదికకు హాజరయ్యారు. రాజధాని లేకుండా, ఆర్థిక కష్టాలతో ఉన్నప్పటికీ రూ.24,500 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన ఘనత టీడీపీదేనన్నారు. ఇప్పటివరకు 54.98 లక్షల మంది రైతులకు రూ.14,688 కోట్లను నేరుగా ఖాతాలో జమ చేశామన్నారు. గతంలో రైతు సాధికారసంస్థ గన్నవరంలో రైతు రుణమాఫీ ఫిర్యాదులను స్వీకరించేదని, రైతుల సమస్యల దృష్ట్యా జిల్లాలవారీగా పర్యటిస్తోందని పేర్కొన్నారు. త్వరలో డివిజన్‌స్థాయిలో ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. వరద నీటితో ప్రాజెక్టులు నిండుతుంటే, ఆ నీళ్లు చూసి ప్రతిపక్షాల గుండెలు బరువెక్కుతున్నాయని ఎద్దేవా చేశారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 70-80 శాతం పంట ఉత్పత్తులను కేంద్రం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తోందని, మన రాష్ట్రంలో 20 శాతం కూడా కొనుగోలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి మొక్కజొన్న, జొన్న ఒక్క క్వింటా కూడా కొనలేదన్నారు. మొక్కజొన్న, జొన్నకు రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాకు రూ.200 ప్రోత్సాహకం అందిస్తోందన్నారు. మరో పక్క, జూన్‌, జులై నెలల్లో వర్షపాతం ఆధారంగా కర్నూలులో 37 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. 2.77 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.295 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com