ఇదేమి..రామా..

పారిశుద్ధ్య కార్మికుల సమ్మె భద్రాద్రినీ ప్రభావితం చేసింది. ఎక్కడికక్కడ పేరుకుపోయినచెత్తతో పవిత్ర రామాలయం పరిసరాలు కంపుకొడుతున్నాయి. దీంతో భక్తులు నానాపాట్లు పడుతున్నారు. దక్షిణభారత అయోధ్యగా భద్రాద్రి రామాలయానికి పేరు. ఇంతటి ప్రముఖ పుణ్యక్షేత్రం దుర్గందభరితంగా మారింది. భక్తులు ముక్కు మూసుకుని తిరిగే దుస్థితి నెలకొంది. తెలంగాణవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. పుణ్యస్నానాలకోసం గోదావరికి వచ్చే భక్తులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. స్నానాల ఘాట్ వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం, బురదలో తిరగలేక అవస్థలు పడుతున్నారు. శ్రీ సీతారాముల దివ్యదర్శనానికి ప్రతిరోజూ భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఇంతటి రద్దీ ఉండే ప్రాంతంలో పారిశుద్ధ్యం పనులు పడకేయడం సమస్యాత్మకంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం, పారిశుద్ధ్య విభాగం స్పందించి కార్మికులతో తలెత్తిన వివాదాలను పరిష్కరించాలని అంతా కోరుతున్నారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా సాగించి రామాలయ పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తిచేస్తున్నారు. దైవ దర్శనానికి వస్తున్న భక్తులకు భద్రాచలంలో మరోకోణం కనిపిస్తోంది. రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో పందులు స్త్వైర విహారం చేస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతంలో అపరిశుభ్రత తాండవిస్తుండడంపై అంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనా ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుని ఇబ్బందులు తొలగించాలని అంతా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com