రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’..

నోటాపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును మంగళవారం వెల్లడించింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు అవకాశం లేదని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం రద్దుచేసింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు స్థానం కల్పిస్తూ ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు అవకాశం లేదని, ఇది ఎగువ సభలో రాష్ట్రాలకు నిష్పాక్షిక ప్రాతినిథ్యం కల్పించే ఎన్నికని స్పష్టం చేసింది. గతేడాది గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌లో నోటాకు అవకాశం కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ విప్ శైలేశ్ మనుభాయ్ పర్మార్ గత నెలలో సుప్రీంను ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు అవకాశం కల్పించడమంటే ఎమ్మెల్యేల బేరసారాలకు, అవినీతికి తెరతీయడమేనని మనుభాయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రత్యక్ష ఎన్నికల మాదిరిగా రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో నోటాను ఎందుకు అనుమతించారని ఈసీని ప్రశ్నించింది. రాజ్యాంగ చట్టం దానికి విరుద్ధంగా ఎందుకుండాలని, ఒకవేళ ఓ సభ్యుడు ఓటువేయకపోతే అతడిని ఆ పార్టీ బహిష్కరిస్తుంది.. కానీ మీరు నోటాకు అవకాశం ఇవ్వడం ద్వారా ఓటు వేయకపోవడాన్ని చట్టబద్ధం చేస్తారా అంటూ ఈసీని ధర్మాసనం నిలదీసింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటరు ఈ నోటా సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని 2013లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో అప్పటి నుంచి నోటాను ఎన్నికల సంఘం అభ్యర్థుల జాబితాలో చేర్చింది. అయితే నోటా ఓట్లను పెద్దగా పరిగణించడం లేదు. నోటాకు ఓట్లేసినా కనీస మెజార్టీ ఓట్లు సాధించిన వ్యక్తినే విజేతగా ప్రకటిస్తున్నారు. ఇక రాజ్యసభ ఎన్నికల్లో 2014 నుంచి నోటాకు ఈసీ అవకాశం కల్పించింది. దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే, బీజేపీ మద్దతు తెలియజేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com