అందని పరిహారం (అనంతపురం)

అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్నల కుటుంబాలకు పరిహారం అందని ద్రాక్షలా మారింది.శాఖల మధ్య సమన్వయలోపం… అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధులకు పట్టించుకొనే తీరిక లేకపోవడం ఆ కుటుంబాలకు శాపంగా మారింది. రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబాలు ఆపన్న హస్తం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నాయి. జిల్లాలో గత మూడేళ్లలో 25 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మవరం, సోమందేపల్లి, అనంతపురం గ్రామీణ ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలు పరిహారం కోసం ఎదురు చూస్తున్నాయి. సకాలంలో సాయం అందకపోగా కుటుంబాల బాధ్యత మహిళలపై పడింది. పిల్లలను పోషించేందుకు, చదివించేందుకు వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. చేనేత మగ్గాలు నేస్తూ వచ్చే అరకొర కూలి డబ్బులతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఉబికి వచ్చే కన్నీటిని దాచుకొని పిల్లల భవిష్యత్తు కోసం రెక్కల కష్టం చేస్తున్నారు.
ధర్మవరం శారదానగర్‌కు చెందిన చింతా బాలకృష్ణ 8.11.2015న అప్పుల బాధతో ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. మగ్గాల నిర్వహణకు, కుటుంబ పోషణకు రూ.4 లక్షల వరకు అప్పు చేశారు. ఆయన మృతితో కుటుంబ బాధ్యత భార్య త్రివేణిపై పడింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. వైష్ణవి నాలుగో తరగతి, లక్ష్మీకళ ఒకటో తరగతి చదువుతోంది. సొంతిల్లు లేదు. అద్దె ఇంట్లో నివాసం. త్రివేణి చేనేత మగ్గం నేస్తూ పిల్లలను చదివిస్తోంది. బాలకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇంత వరకు పరిహారం అందలేదు. భర్త మృతితో కేవలం రూ.1,000 పింఛన్‌ వస్తోంది. పింఛన్‌ సొమ్ము, చేనేత మగ్గంపై పావడాలు తయారు చేయగా వచ్చే కూలితోనే కుటుంబపోషణ, పిల్లల చదువులకు వెచ్చించాల్సి వస్తోంది. పరిహారం కోసం ఆమె రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
ఆత్మహత్య చేసుకున్న ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.1.5 లక్షలు రావాల్సి ఉంది. కార్మికులకు పరిహారం ఇచ్చే ముందు ఆత్మహత్యలపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ చేయాలి. ఇందులో ఆర్డీవో, డీఎస్పీ, చేనేత జౌళి శాఖ ఏడీ సభ్యులుగా ఉంటారు. కమిటీ ఆమోదం మేరకు ప్రభుత్వం నుంచి కలెక్టర్‌ ఖాతా ద్వారా రూ.1.50 లక్షలు ఇది వరకు చేనేత కార్మికులకు పరిహారం ఇచ్చేవారు. ఇందులో రూ.50 వేలు అప్పులు తీర్చేందుకు, రూ.లక్ష ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబసభ్యుల పేరుతో బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. పిల్లల చదువులకు, ఆడపిల్లల పెళ్లిళ్లకు బ్యాంకు నుంచి నగదు తీసుకునేందుకు అనుమతి ఇచ్చేవారు.
జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 25 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు అర్హులను కమిటీ ఎంపిక చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించారు. చేనేతజౌళి శాఖ వారే పరిహారం సొమ్ము ఇవ్వాలని రెవెన్యూ ఉన్నతాధికారులు ఆ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. అందుకు సమాధానంగా కలెక్టర్‌ ఖాతా నుంచే ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని చేనేత జౌళి శాఖ కమిషనర్‌ లేఖ రాశారు. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం పరిహారం అందక చేనేత కార్మిక కుటుంబాలు నలిగిపోతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com