నిర్లక్ష్యమే నీటికి ఇబ్బంది (గుంటూరు)

పట్టణానికి నీరందించే చెరువు పూర్తిగా అడుగంటిన తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. అక్కడ ప్రతికూలత ఎదురుకావడంతో నాగార్జునసాగర్‌ కాలువ నుంచి ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చి సరఫరా చేస్తున్నారు. దశాబ్దానికి పైబడి తాగునీటి సమస్య వెంటాడుతున్నా నిర్మాణాత్మక చర్యలు తీసుకునే దిశగా పాలకులూ దృష్టి సారించలేదు. సాగర్‌ కాలువలు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్నా అవసరమైనంత నీటిని నిల్వ చేసుకునే చెరువు లేక ఈ పరిస్థితి తరచూ తలెత్తుతోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు కలిసి సంయుక్తంగా సమస్య శాశ్వత పరిష్కారానికి ముందడుగు వేయాల్సివుంది.
వినుకొండ మున్సిపాలిటీ ఏర్పడి 13 ఏళ్లు పూర్తయింది. పట్టణం వేగంగా విస్తరిస్తున్నా ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచినీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి చెందలేదు. సాగర్‌ కాలువల నుంచి సింగర చెరువులో నీరు నిల్వ చేసి సరఫరా చేయడంతోనే సరిపెట్టారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా చెరువును విస్తరించడం, కట్టలు బలోపేతం చేయడం, సరఫరాలో లోపాలను సరిదిద్దుకుంటూ వృథాను అరికట్టి సమర్థంగా వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టలేదు. ఇక్కడ పనిచేసిన ఇంజినీర్లు చొరవ తీసుకుని ప్రణాళికలు రూపొందించకపోవడం, నేతలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ సొమ్ము చేసుకోవడానికి అలవాటు పడటంతో సరఫరాను గాడిన పెట్టే పరిస్థితి లేకపోయింది. ఎద్దడి తలెత్తినప్పుడు మరిన్ని ట్యాంకర్లు పెంచి తాత్కాలికంగా సరఫరా చేసేవారు. దీనిని కూడా కొందరు అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకున్నారు. దీంతో కొన్ని వార్డులకు ఇప్పటికీ ట్యాంకర్లే దిక్కంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసుకుంటున్న రోజుల్లో పట్టణంలో ఏకంగా 10 వార్డులకు సక్రమంగా అంతర్గత పైపులైను వ్యవస్థే లేదంటే ఎంతటి అలక్ష్యమో గమనించవచ్చు. కొందరు పాలకవర్గ సభ్యులకు ట్యాంకర్లపై ఉన్న శ్రద్ధ నీటి వనరుల అభివృద్ధిపై లేకపోవడం గమనార్హం. చెరువులో నీరు అడుగంటగానే ట్యాంకర్లకు టెండర్లు పిలవడం, ముందస్తు ఒప్పందం ప్రకారం టెండరు అప్పగించడం ద్వారా లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
వినుకొండకు సింగర చెరువు నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారు. సాగర్‌ కాలువల నుంచి దీనిలోకి వచ్చే నీటిని శుద్ధి చేసి పట్టణానికి అందిస్తున్నారు. విస్తీర్ణం 160 ఎకరాలున్నా 60 ఎకరాల్లో నిల్వ ఉన్న నీటిని మాత్రమే ఇందుకు వినియోగిస్తున్నారు. ఇందులో కూడా 8 అడుగులకు మించి నీరు నిలిచే పరిస్థితి లేకపోవడంతో మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నా మూడు నెలలకు మించి సరిపోవడం లేదు. ఈ క్రమంలో మొత్తం విస్తీర్ణాన్ని 20 అడుగుల లోతులో నీరు నిలిచేలా అభివృద్ధి చేయాలి. కట్టలు బలోపేతం చేసి అడుగుభాగంలో నల్లమట్టి వేసి నీరు భూమిలోకి ఇంకిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సింగర చెరువుకు పైభాగాన 50 అడుగుల ఎత్తులో దొండపాడు చెరువు ఉండగా అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా పైపులైనులో నీటిని తీసుకువచ్చే వెసులుబాటు ఉంది. ఇలా సింగరను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే 1800-2000 మిలియన్‌ లీటర్లు నిల్వ చేయవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సరఫరా, ఆవిరి, నష్టాల రూపంలో 33 శాతం నీరు వృథా అవుతోంది. పట్టణానికి రోజుకు 7 మిలియన్‌ లీటర్లు సరఫరా చేసినా నాలుగు నుంచి ఐదు నెలలపాటు సరఫరాకు ఇబ్బంది తలెత్తదు.
వెల్లటూరు సమీపాన సాగర్‌ కుడి కాలువ కట్టపై పంపింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుచేసి సింగర చెరువుకు నీటిని తోడించవచ్చు. 16.3 కిలోమీటర్ల దూరం మేర పైపులైను నిర్మించాల్సివుంది. సింగర చెరువు వరకు సాగర్‌ కాలువ ఉన్నందున ఇందుకు పెద్దగా భూసేకరణ అవసరం ఉండదు. దొండపాడు చెరువు మీదుగా పైపులైను వేస్తూ అక్కడ వాల్వ్‌ ఏర్పాటు చేయాలి. సింగర చెరువులో నీరు అడుగంటినప్పుడు దొండపాడు చెరువు నుంచి పైపులైను ద్వారా గ్రావిటీతో తీసుకునే వెసులుబాటు సైతం ఉంటుందనేది ఇంజినీర్ల ప్రణాళిక. ఇలా సింగర చెరువును అభివృద్ధి చేయాలంటే ఏడాది సమయం పడుతుంది. ఇందుకు అనుగుణంగా సాగర్‌ కాలువ నుంచి తొలుత పైపులైను నిర్మాణం పూర్తిచేసి నేరుగా నీటి శుద్ధి కేంద్రానికి పంపింగ్‌ చేసి అక్కడి నుంచి పట్టణానికి సరఫరా చేయాలి. దీనివల్ల సరఫరాకు ఇబ్బంది లేకుండా చెరువును అభివృద్ధి చేసుకోవచ్చు. అయితే ఈ పథకం పట్టాలెక్కాలంటే జిల్లా పాలనాధికారి కోన శశిధర్‌ చొరవ తీసుకుని జలవనరులు, రెవెన్యూ, ప్రజారోగ్య, పురపాలక శాఖల యంత్రాంగాన్ని సమన్వయం చేసి యుద్ధప్రాతిపదికన నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి ప్రజాప్రతినిధులు ముందడుగు వేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com