నిధులిస్తేనే వైద్యం (కడప)

అభివృద్ధికి అవసరమైన నిధులున్నా.. ఆ దిశగా అధికారులు అడుగేస్తున్నా ‘మధ్యవర్తుల’ నిర్లక్ష్యంతో మధనపడాల్సిన దుస్థితి.. పేద రోగులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. రిమ్స్‌లో కొన్ని కీలక పరికరాల కొనుగోళ్లకు సంబంధించి ఏడాది కాలంగా నిర్లక్ష్యం నెలకొనడం నిర్వేదం నింపుతోంది. ఎంతకూ పరికరాలు, యంత్రాలు రాకపోవడంతో అధికార యంత్రాంగం అవస్థ పడుతుండటం పరిపాటైంది. గత ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో కడప రిమ్స్‌ ఏర్పాటు చేసింది.రూ.కోట్లు వెచ్చించి భారీఎత్తున వసతి సముదాయాలు నెలకొల్పినా ఆ మేరకు అవసరమైన పరికరాలు సమకూర్చలేదు. వైద్యాలయాన్ని నడిపించే డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ వంటి కీలక పోస్టులనూ అటానమస్‌ కింద నడిపించడం.. ఒప్పంద పద్ధతిలోనే కొనసాగించడం నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. మొత్తం ఆగుగురు ఒప్పంద పద్ధతిలో కొనసాగుతుండగా మిగిలిన వారు రెగ్యులర్‌ అయినా ఆ పోస్టులు అనేకం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పరికరాల కొరత మరో సమస్యగా మారింది. చిన్నపాటి శస్త్రచికిత్సలకూ ఇబ్బంది ఉంటోంది. ఏడాదిన్నర కిందట ప£లు పరికరాలు, యంత్రాలు అవసరమని ప్రతిపాదించడంతో ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద ప్రభుత్వం కొన్నింటిని మంజూరు చేసింది. వైద్యాలయం అవసరాలను దృష్టిలో ఉంచుకుని రివాల్వింగ్‌ ఫండ్‌ నుంచి మరికొన్ని పరికరాలను సమకూర్చుకునేందుకు రిమ్స్‌ ప్రయత్నించింది. ఇందులోనే సమస్య తలెత్తింది.
రిమ్స్‌ రివాల్వింగ్‌ ఫండ్‌ నుంచి రూ.4 కోట్ల మేర వెచ్చించి పరికరాలను కొనుగోలు చేసేందుకు ఏడాది కిందట అధికారగణం నిర్ణయించారు. ఆ మేరకు సైకియాట్రి, గైనకాలజీ, మెడిసిన్‌, సర్జరీ, ఆర్థో, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఆఫ్తాల్మిక్‌, పల్మనరీ మెడిసిన్‌.. ఇలా అన్ని విభాగాల నుంచి ప్రతిపాదనలు కోరారు. అవసరమైన పరికరాలు, యంత్రాల జాబితా రూపొందించి ఉన్నతవర్గాలకు నివేదించారు. ఆ జాబితాల ప్రకారం ప్రభుత్వ రంగ ఏజెన్సీ అయిన ఆంధ్రప్రదేశ్‌ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఐడీసీ) ద్వారా కొనుగోళ్లు జరిపేందుకు నిర్ణయించారు. కొనుగోళ్లకు సదరు ఏజెన్సీ టెండరు ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. రిమ్స్‌ అధికారుల వద్ద ఆమోదముద్ర పడినా ఏపీఎంఐడీసీ టెండరు ప్రక్రియలో జాప్యంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా సదరు ఏజెన్సీకి ఒకే తరహాలో టెండరు ప్రక్రియ నిర్వాహించాల్సి రావడంతో జాప్యం జరుగుతోంది. ప్రతిపాదలన్నీ కాగితాల్లోనే కనిపిస్తుండటం సమస్యను జటిలం చేస్తోంది.
రోస్కోపిక్‌, ఎండోస్కోపిక్‌ యంత్రాలతో పాటు ఈసీజీ, ఈ-ఛానల్‌ మానిటర్‌, ఈసీపీ, ఈఈపీ యంత్రాలను ప్రతిపాదించారు. శస్త్రచికిత్స సంబంధ అనేక ముఖ్యమైన యంత్రాలను ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందులో కొన్ని రిమ్స్‌లో వినియోగంలో ఉన్నా.. మరికొన్ని పూర్తిగా లేవు. ఉన్నవి మరమ్మతులకు గురైతే మిన్నకుండిపోవడం తప్ప మరో దారిలేదు. తప్పనిసరై ప్రైవేటు కేంద్రాలకు రెఫర్‌ చేయాల్సిన దుస్థితి. ఎంఆర్‌ఐ ఏర్పాటు కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోయింది. ప్రైవేటు డయాగ్నసిస్‌ సెంటర్ల ఆదాయానికి గండిపడుతుందనే ఉద్దేశంతో రిమ్స్‌లో ఏర్పాటుకు విముఖత చూపుతున్నారన్న విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అధికారుల తాత్సారం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. ఆఖరుకు సీటీస్కాన్‌ ఉన్నా తరచూ మరమ్మతులకు గురవుతోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు రిమ్స్‌ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com