తూర్పు గోదావరి లో 90 కిపైగా క్వారీలు

తూర్పుగోదావరి జిల్లాలో క్వారీలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనుమతి ఉన్న వాటికన్నా అనధికారికంగా తవ్వకాలు చేపడుతున్న క్వారీల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ చేపట్టే పేలుళ్లపై నిఘా లేకపోవడంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. కర్నూలు జిల్లాలో రాత్రి క్వారీలో ఉంచిన జిలిటిన్‌ స్టిక్స్‌ పేలిన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో కూలీలు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జిల్లాలోని క్వారీల్లోనూ చోటుచేసుకునే అవకాశమున్నా యంత్రాంగం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. జిల్లాలో మెట్టతో పాటు మన్యం, ఉపప్రణాళిక ప్రాంతంలో నల్ల, ఎర్రరాయి క్వారీలతో పాటు సిమెంటు తయారీలో ఉపయోగించే లాటరైట్‌, ఇతర గనులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో క్వారీల్లో పేలుళ్ల ప్రభావం 90కి పైగా గ్రామాలపై ప్రత్యక్షంగా పడుతోంది. క్వారీల్లో పేలుళ్ల నిర్వహణ లైసెన్సు పొందిన వారి సమక్షంలోనే జరగాలి. కానీ జిల్లాలో వీరి సంఖ్య అయిదు లోపే ఉంది. పేలుడు పదార్థాలు నిల్వ ఉంచే కేంద్రాలు జిల్లాలో 10 వరకూ ఉన్నాయి. క్వారీల్లో పేలుళ్లకు సంబంధించి అనుమతి ఇచ్చిన మేగ్‌జైన్‌లపై నిరంతరం నిఘా ఉంటుంది. ఎవరికి విక్రయిస్తున్నారు..ఎక్కడ వినియోగిస్తున్నారనే విషయాన్ని తరచూ పరిశీలిస్తాం. క్వారీల్లో పేలుళ్ల వ్యవహారంతో పాటు అక్కడ తవ్వకాలకు సంబంధించి అనుమతులను సమీక్షిస్తాం. తేడాలుంటే కఠిన చర్యలు చేపడతామంటున్నారు అధికారులు.పేలుడు సామగ్రిని అధికారికంగా పొందినా వాటి వినియోగం మాత్రం నిపుణుల సమక్షంలో జరగడం లేదు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో నల్లరాయి క్వారీలు అధికంగా ఉన్నాయి. ఏలేరు ప్రాజెక్టుకు ఇవి దగ్గరగా ఉండడం వల్ల పేలుళ్లు దీనిపై ప్రభావం చూపుతాయన్న కారణంతో 36 క్వారీలను మూసివేశారు. రౌతులపూడి మండలం ఎస్‌.పైడిపాల, గుమ్మరేగుల, ములగపూడిలోని నల్లరాయి క్వారీలో పేలుళ్లు సమీప గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడిలోని క్వారీలో పేలుళ్లు పరిసరాల్లో 10 కిలోమీటర్ల మేరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రత్తిపాడు సమీపంలోని జగపతినగరం కొండపైనా కొందరు రాత్రి పూట పేలుళ్లకు పాల్పడుతున్నారు.క్వారీల్లో పేలుళ్లు చేపట్టిన అనంతరం రాళ్లను తొలగించడంలో అండలు జారి పలు దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. క్వారీల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి రక్షణ చర్యలు కానరావడం లేదు. కార్మికులు చేతులు, కాళ్లకు ఉపయోగించే రక్షణ సామగ్రిని క్వారీల నిర్వాహకులే సరఫరా చేయాల్సి ఉన్నా ఎక్కడా ఇది అమలు జరగడం లేదు.ఈ పరిస్థితిలో సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టి క్వారీల్లో నిబంధనల ఉల్లంఘనకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. అనుమతి లేని క్వారీలను మూసివేయడంతో పాటు అనుమతించిన చోటా పేలుడు పదార్థాల వినియోగంపై నిఘా ఉంచాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా అంగుళూరు కొండ వద్ద జలవిద్యుత్తు కేంద్రం మట్టి పనులు జరుగుతున్నాయి. పేలుళ్లతో ఓ రాయి వాహనం వెనుక భాగంపై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *