మోడ్రన్ స్కూల్స్

డిజిటల్‌ తరగతులు.. బయోమెట్రిక్‌ హాజరు నమోదు.. ఐరిస్‌ ట్యాబ్‌ల సేవలు.. యాప్‌ ద్వారా ఉపాధ్యాయుల సెలవుల మంజూరు.. మొత్తంగా సాంకేతికబాటలో వేగంగా పయనిస్తున్న విద్యాశాఖ అడుగులు ఇవి. దీర్ఘకాలికంగా వాటి అమలు, పర్యవేక్షణ తీరు, నిధుల సమకూర్పు, ఎప్పటికప్పుడు ఆయా విధానాల్లో కాలానుగుణంగా వచ్చే మార్పులతో ఎలా ముందుకు వెళతారన్నది భవిష్యత్తు తేల్చాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ప్రతీ అంశానికి సాంకేతికతను జోడించి పారదర్శకంగా శాఖను ముందడుగు వేయించడంలో నూతన ఉత్సాహం చూపుతూనే ఉన్నారు. ఉపాధ్యాయుల హాజరు నమోదుకు బయోమెట్రిక్‌ యంత్రాలు, ఐరిస్‌ ట్యాబ్‌లను పంపిణీ చేసి ప్రస్తుతం దాన్ని పకడ్బందీగా అమలు చేసేలా అధికార యంత్రాంగం ముందుకు వెళుతోంది. ఉపాధ్యాయుల సెలవుల నమోదు సైతం ఓ యాప్‌తో అమలు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, వారికి ప్రభుత్వం వైపు నుంచి అందుతున్న సంక్షేమ ఫలాలు నిక్కచ్ఛిగా చేరవేయడంలో భాగంగా వారికీ బయోమెట్రిక్‌ హాజరును అమలు చేయాలని శాఖ కసరత్తు చేసింది.
గతేడాది పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ విధానాన్ని అమలులోకి తీసుకు రాగలిగారు. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా విద్యార్థుల ఆధార్‌ నమోదుతో పాటూ వివరాల గణన నమోదు కొనసాగుతూనే ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలల్లో ఉపాధ్యాయుల విధులు, విద్యార్థుల కార్యకలాపాలపై సాంకేతికత అడుగులతో క్రమశిక్షణను ఉన్నతాధికారుల పర్యవేక్షణే లక్ష్యంగా కళ్లకు కట్టవచ్చు. అదే దారిలో ప్రభుత్వం, విద్యాశాఖ వేస్తున్న కొత్త అడుగు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వర్చువల్‌ తరగతులు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల వారీగా అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ జరుపుతున్నట్లుగా ఒక సబ్జెక్టు నిపుణుడి బోధన ఒకే సమయంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులు వినేలా, విషయ పరిజ్ఞానం పెంచుకునేలా, అనుమానాలను నివృత్తి చేసుకునేలా, మేధావులతో ముఖాముఖి విషయాలను చర్చించుకునే దిశగా ఈ వర్చువల్‌ తరగతులు నిర్వహించనున్నామనీ నాణ్యమైన విద్య ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానానికి కసరత్తు చేస్తోందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వర్చువల్‌ తరగతుల నిర్వహణలో భాగంగా కడప జిల్లాలో 279 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. మొదటి విడతగా 100 ఉన్నత పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేసి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో ఓ సంస్థ ఆయా ఉన్నత పాఠశాలల్లో వర్చువల్‌ తరగతులకు ఏర్పాట్లను చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 391 ఉన్నత పాఠశాలలు ఉండగా వాటిల్లో మొదటి విడతగా 100 ఎంపిక చేశారు. మిగతా వాటిల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం పునః పాఠశాలల ప్రారంభం నాటికి అన్ని ఏర్పాట్లు చేస్తారని శాఖలో చర్చ సాగుతోంది. ఐఏఎస్‌ అకాడమీ, గ్రూప్‌-1, గ్రూప్‌-2 ప్రిపరేషన్లలో భాగంగా పలు శిక్షణ కేంద్రాలు, నాలెడ్జ్‌ సెంటర్లలో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉంది. విశ్వవ్యాప్త, దేశవ్యాప్త సబ్జెక్టు నిపుణులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇలా ప్రతి రంగంలోని నిష్ణాతులుగా గుర్తించిన వారి శిక్షణలను గతంలోలా నేరుగానే ఖచ్చితంగా వినాలనే అవసరం లేకుండా విషయ పరిజ్ఞానం పొందడమే లక్ష్యంగా వర్చువల్‌ తరగతుల ఉద్ధేశం సమాజంలో ముందుకు వెళుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోకి ఉన్నత పాఠశాలల స్థాయిలో దీనిని అమలు చేయడం విద్యాశాఖ చేస్తున్న ప్రయోగం. కొత్త ఆలోచన. డిజిటల్‌ తరగతులలో అయితే రికార్డు అయిన సందేశాన్ని మాత్రమే విద్యార్థులకు చూపించవచ్చు. వర్చువల్‌ తరగతులలో లైవ్‌లో బోధన చేస్తున్న వారు ఉండటం, వారితో సాంకేతికంగా తెరపై చూస్తూ మాట్లాడుకునే, సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉండటంతో విద్యార్థులకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని శాఖ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో దాని అమలు మొత్తంగా కార్యక్రమ విజయవంతాన్ని తేల్చనుంది.
మొదటి విడతగా వంద ఉన్నత పాఠశాలల్లో వర్చువల్‌ తరగతుల నిర్వహణకు పనులు జరుగుతున్నాయి. వాటిల్లో బేస్‌ ఇన్స్‌లేషన్‌, సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌, ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ మూడు దశల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 77 ఉన్నత పాఠశాలల్లో బేస్‌ ఇన్స్‌లేషన్‌, సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌ జరుగుతుండగా 23 ఉన్నత పాఠశాలల్లో ఈ రెండు దశలతో పాటూ ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వంద ఉన్నత పాఠశాలలూ పూర్తిస్థాయిలో ఆగస్టు 10వ తేదీ నాటికి వర్చువల్‌ తరగతులకు సిద్ధం కావాల్సి ఉండగా ఇప్పటికీ పనులు కొనసాగుతున్నాయి. పనుల్లో వేగం పుంజుకొని సకాలంలో విద్యార్థులకు తరగతుల నిర్వహణను చేరువ చేయాల్సిన బాధ్యతను ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com