గెలుపు బాధ్యత మంత్రులదే

మంత్రులే కీలకమని, వచ్చే ఎన్నికల్లో గెలుపు బాధ్యతను భుజానకెత్తుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలు ఉన్నట్లా? లేనట్లా అన్నది స్పష్టంగా చెప్పనప్పటికీ ఎన్నికలకు మాత్రం సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. ఎన్నడూ లేని విధంగా గులాబీ బాస్ దాదాపు ఏడు గంటల పాటు 17మంది మంత్రులతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. అధికారులందరినీ బయటకు పంపి ఏకాంతంగా అమాత్యులతో కేసీఆర్ ఏడు గంటల పాటు జరిపిన సుదీర్ఘ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా సెప్టెంబరు 2వ తేదీన జరగాల్సిన ప్రగతి నివేదన సభ ఏర్పాట్లపై తొలుత కేసీఆర్ సమీక్షించారు. సభకు 25 లక్షల మంది హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యతను కూడా మంత్రులపైనే ఉంచారు. అలాగే వివిధ జిల్లాల్లోని నియోజకవర్గంలోని పరిస్థితులను మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన మంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు ఎమ్మెల్యేల పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.అలాగే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ సీట్లు ఇస్తానని ఈ సందర్భంగా కేసీఆర్ పునరుద్ఘాటించినట్లు సమాచారం. తాను చేయించిన సర్వేలో నలుగురైదుగురు మినహా అందరూ మంచి మార్కులే సాధించారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వంద సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తిరిగి అధికారం మనదేనన్న ధీమాను వారిలో నింపారు. అయితే ఇక పై ప్రతి రోజూ కీలకమేనని మంత్రులందరూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండాలని వారిని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరేనని కేసీఆర్ మరోసారి స్పష‌్టం చేశారు.వచ్చే నెలలోనే అభ్యర్థులను ఖచ్చితంగా ప్రకటిస్తానని కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం జాబితాను కూడా ఇప్పటికే రూపొందించానని తెలిపారు. ఈ నెల 24వ తేదీన పార్లమెంటరీ, శాసనసభ పక్ష సమావేశం జరపాలని నిర్ణయించారు. అలాగే వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళదామని కేసీఆర్ అన్నారు. మొత్తం మీద కేసీఆర్ దాదాపు ఏడు గంటల పాటు నాలుగున్నరేళ్ల తర్వాత మంత్రులతో మనసు విప్పి మాట్లాడటంతో సమావేశం నుంచి బయటకు వచ్చిన వారు ఆనందంతో తబ్బిబ్బయి పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com