మందులేవి..?

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే నిరుపేదలకు గ్రామాల్లోనే నేరుగా వైద్యసేవలు అందించడంతోపాటు అవసరమైన మందులను ఇవ్వడానికి ప్రభుత్వం 104 వాహనాలను ప్రవేశపెట్టింది. అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ వాహనాల్లో అవసరమైన మందులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఆరు నెలలుగా మందులు సక్రమంగా రావడం లేదు. బాధితులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మాత్రలను కచ్చితంగా వేసుకోవాలి. మందులు లేకపోవడం వల్ల బయట కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు.
మెదక్‌ జిల్లాలో 104 వాహనాలు ఆరు ఉన్నాయి. ప్రతి నెల నిర్ణీత తేదీల్లో గ్రామాలకు వెళ్లి బాధితులను పరీక్షిస్తుంటారు. దీర్ఘకాలిక రోగులకు నెలకు సరిపడా మాత్రలను అందిస్తుంటారు. జిల్లాలో దాదాపు మూడు వేల మంది మధుమేహ వ్యాధిగ్రస్థులకు వాహనాల ద్వారా సేవలందిస్తున్నారు. నెలలో ఒక్క రోజు గ్రామానికి వచ్చే వాహనం వద్దకు రోగులు పెద్దఎత్తున వస్తుంటారు. ఆరు నెలలుగా మాత్రలు రాకపోవడంతో సిబ్బంది రోగులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. కౌడిపల్లి మండలంలోని కొట్టాల, రాయిలాపూర్‌ గ్రామానికి మంగళవారం వాహనం వెళ్లడంతో రోగులు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. మందులు లేవనడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ రెండు గ్రామాల్లోనే దాదాపు 40 మంది వరకు మధుమేహ రోగులున్నారు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లోనే మందులు లేకపోవడంతో సిబ్బంది ఏం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా మధుమేహానికి మూడు రకాల మాత్రలు ఇస్తున్నారు. మూడు కలిపి నెలకు దాదాపు 66 వేల మాత్రలు అవసరం. అరకొరగా 3 నుంచి 4 వేల మాత్రలే సరఫరా చేస్తున్నారు. అవి రెండు మూడు రోజులకే సరిపోతున్నాయి. నెలలో ఒక వాహనం 24 రోజులపాటు గ్రామాలకు వచ్చి వైద్య సేవలతోపాటు మందులను అందిస్తున్నాయి.
మందులు అందుబాటులో లేక బాధితులు బయట కొనాల్సి వస్తోంది. నెలకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నెల మొదటివారంలో కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి బూరుగడ్డ గ్రామానికి వచ్చిన జిల్లా పాలనాధికారి దృష్టికి సమస్యను ఏఎన్‌ఎం సుగుణ తీసుకెళ్లారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధుమేహానికి సంబంధించిన మాత్రలను అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com