కేరళకు అండగా మనం సైతం…

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి అండగా నిలబడింది. తమ వంతు సాయాన్ని ఆ రాష్ట్ర ప్రజలకు అందించాలని ముందడుగు వేసింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కార్యాలయ ప్రాంగణంలో కేరళకు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని మనం సైతం చేపట్టింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మా అధ్యక్షుడు శివాజీ రాజా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బెనర్జీ, ఏడిద శ్రీరామ్, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, భాజపా నేత చింతల రామచంద్రారెడ్డి, మనం సైతం సభ్యులు బందరు బాబీ, వినోద్ బాలా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…కేరళలో వచ్చిన జల విలయం దేశంలోనే అత్యంత విషాధకరమైనది. ఉత్తరాఖండ్ వరదల కంటే ఇది పెద్ద విపత్తు. ఇవాళ కేరళ కోసం దేశం మొత్తం స్పందిస్తోంది. మనం సైతం కూడా ఇందులో భాగమవడం సంతోషంగా ఉంది. ప్రతి నెల, ప్రతి వారం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు కాదంబరి కిరణ్. ఆయన కృషిని అభినందిస్తున్నాను. అన్నారు.
కాదంబరి కిరణ్ మాట్లాడుతూ….సాటి మనిషికి కష్టమొస్తే ఆదుకోవాలి. మనం సైతం ప్రధాన లక్ష్యమిదే. పేదరికాన్ని నేనొక్కడినే రూపు మాపలేను. కానీ జీవితాంతం పేదలకు సేవ చేస్తూనే ఉంటాను. ఎవరున్నా లేకున్నా మనం సైతం సేవా కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. భూతల స్వర్గమైన కేరళ ఇవాళ జలదిగ్భందంలో చిక్కుకుంది. కేరళకు మన వంతు సహాయం మనం సైతం నుంచి చేస్తున్నాం. బియ్యం, బట్టలు, నిత్యావసర వస్తువులను సేకరిస్తున్నాం. సహాయం చేసేందుకు ముందుకొస్తున్న వాళ్లకు, నాకు అండగా నిలబడిన నా స్నేహితులకు కృతజ్ఞతలు. అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత వడ్లపట్ల మోహన్ గౌడ్ బియ్యం, దుస్తులు విరాళంగా అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com