టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధానం పోటీ

0

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటి నుంచే ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్యే ప్రధానం పోటీ జరిగింది. అయితే, ఈ ఎన్నికల్లో అధికార, ప్రధాన ప్రతిపక్షంతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలు ఉండడంతో పోరు రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికలపై అధికార పార్టీ బాగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధినే ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని ఆ పార్టీ అధిష్ఠానం నేతలకు వివరిస్తోంది. మరోవైపు, బీజేపీయేతర కూటమి ఏర్పాటు వైపు అడుగులు పడుతున్నందున చంద్రబాబు ఆయా పనుల్లో బిజీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎన్నికల సన్నాహాలను వీలైనంత త్వరగా ముగించాలని ఆయన భావిస్తున్నారు.కొద్దిరోజుల క్రితమే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన టీడీపీ అధినేత.. తాజాగా మరో విషయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అదేమిటంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేతలందరినీ విడుతల వారీగా పిలిచి వారితో సమావేశమవడం. ఇలా ఇప్పటి నుంచే వారితో మాట్లాడి అభ్యర్థుల ప్రకటన నాటికి అసంతృప్తి లేకుండా చేయాలన్నదే చంద్రబాబు ప్లాన్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఎదురైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఒక్కటే కాదు, ఆయన మరో ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యతిరేకత ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను కూడా పిలిపించుకుని చివరి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే పలు చోట్ల కొందరు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. వారికి చివరి అవకాశం ఇవ్వాలని, ఒకవేళ మారకపోతే వారి స్థానంలో ఇంకొకరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వినికిడి. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టీడీపీ 40 మంది కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనుందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

Share.

About Author

Leave A Reply