కరీంనగర్‌లో జీవన ప్రమాణాలు భేష్..

స్మార్ట్ సిటీగా హంగులు సమకూర్చుకుంటున్న కరీంనగర్‌కు మరో ఘనత దక్కింది. జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్న ప్రాంతంగా నిలిచింది. ఈ మేరకు మంచి ర్యాంక్ సైతం సాధించింది. జాతీయస్థాయిలో ప్రకటించిన జీవన ప్రమాణాల ర్యాంకింగ్‌లో కరీంనగర్ 11వ స్థానం కైవసం చేసుకుంది. 5లక్షల జనాభాలో 2వ స్థానం, రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. కరీంనగర్ మొదటిసారిగా జీవన ప్రమాణాల మెరుగు విషయాలపై సర్వేలో పోటీ పడి మెరుగైన స్థానం సంపాదించడం విశేషం. ఇదిలాఉంటే దేశవ్యాప్తంగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ 111 నగరాల్లో సర్వే చేపట్టింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ నగరాలు ఉన్నాయి. మొత్తంగా మూడు నెలల పాటు చేపట్టిన సర్వేలో పలు అంశాలపై నగరవాసులతో ప్రశ్నలు అడిగి అభిప్రాయాలు సేకరించారు. ప్రధానంగా కనీస మౌలిక సౌకర్యాలు, సామాజిక, తాగునీరు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ఆర్థిక, రవాణా, విద్య, ఆరోగ్యం, విద్యుత్తు సరఫరా, సంస్కృతి కార్యకలాపాలు, కాలుష్య నివారణ లాంటి అంశాలపై సమాచారం తీసుకున్నారు. మొత్తంగా 79 సూచికల్లో 550 ప్రశ్నలను సర్వే ద్వారా సేకరించి కరీంనగర్‌లో జీవన ప్రమాణాలు భేష్‌గానే ఉన్నాయని తేల్చారు. కరీంనగర్‌ ఇప్పటికే ఆకర్షణీయ నగరంగా పేరు తెచ్చుకుంది. తాజాగా నగర జీవన ప్రమాణాల విషయంలోనూ మెరుగ్గా ఉండడంతో స్థానికులు, ప్రజాప్రతినిధులు, కార్పోరేషన్ అధికారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

జీవన ప్రమాణాలు మెరుగు పర్చడానికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఏడు శాఖల ద్వారా వివరాలు సేకరించింది. కరీంనగర్‌ నగరపాలక సంస్థ 365 ప్రశ్నలు, పోలీసుశాఖ 20, రవాణాశాఖ 69, విద్యాశాఖ 33, విద్యుత్తుశాఖ 22, కాలుష్య నివారణశాఖ 10, ఆరోగ్యశాఖ 31 ప్రశ్నలతో సమాచారాన్ని తీసుకున్నారు. వివరాల సేకరణను విస్తృతంగా చేపట్టారు. నివాసితుల నుంచే కాకుండా ఆయా విభాగాల్లో అందిస్తున్నవారినీ ప్రశ్నించారు. వారి సేవలను సైతం పరిగణించి ర్యాంక్‌లు కేటాయించారు. ఇందులోనూ కరీంనగర్ మంచి స్థానాలే దక్కించుకుంది. తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ రోజూ నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం, రోజు విడిచి రోజు నీటిని పంపిణీ చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. అంతేకాక ప్రజలకు జవాబుదారిగా పని చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక ఫిర్యాదులు పరిష్కరించడంలోనూ పోలీసుశాఖ నుంచి ఎప్పటికప్పుడు భద్రత చర్యలు తీసుకోవడంలోనూ చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాలతో నేరాలు తగ్గించడం, నేరాలు గుర్తించడం, కాలుష్య నివారణకు మొక్కల పెంపకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం వంటివి పక్కాగా నిర్వహిస్తున్నారు. ఈ చర్యలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కరీంనగర్‌లో జీవన ప్రమాణాలు బాగున్నట్లుగా గుర్తించారని పలువురు అంటున్నారు. ఏదేమైనా ఈ ర్యాంకింగ్‌లో హైదరాబాద్ 27ల స్థానంలో నిలిచింది. కరీంనగర్ 11వ స్థానంలో ఉంది. రాజధానికంటే మెరుగైన ర్యాంక్ రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com