27 నుంచి అమరావతి బాండ్ల లిస్టింగ్

అమరావతి బాండ్ల కు అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో ఈ నెల 27న తలపెట్టిన లిస్టింగ్‌ ప్రక్రియను కోలాహలంగా నిర్వహించేందుకు ఏపీసీఆర్డీయే విస్తృత సన్నాహాలు చేస్తోంది. బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. అమరావతి బాండ్ల లిస్టింగ్‌ సందడిగా జరగనుంది. ఈ బాండ్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అధికారికంగా ట్రేడింగ్‌లోకి రావడంతోపాటు.. వీటిని కొనుగోలు చేసిన సంస్థలకు.. విక్రయించుకొనే వీలు కల్పించడాన్నే లిస్టింగ్‌ అంటారు. ఆర్బీఐ సహా పేరొందిన వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులతోపాటు పెట్టుబడిదారులు కూడా హాజరుకానున్నారు. కొద్ది రోజులుగా వీరందరికీ ఆహ్వానాలు పంపించడంతోపాటు అమరావతి నుంచి ముంబై వెళ్లే వారికి అవసరమైన సౌకర్యాల కల్పనలో సీఆర్డీయే ఉంది. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకు రూ.1,500 కోట్లే ఇచ్చింది. ప్రపంచబ్యాంకు రుణం మంజూరు ఆలస్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో పనులు ఆగకుండా.. అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో సీఆర్డీఏ నిధులు సేకరిస్తోంది. సంస్థ ఆదాయ మార్గాలు, వడ్డీ, అసలు చెల్లింపుల సామర్థ్యం వంటి పలు అంశాల ఆధారంగా వడ్డీరేటు నిర్ణయిస్తారు. ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ అయితే ఒక రేటు, డబుల్‌ ఏ రేటింగ్‌ అయితే ఒక రేటు ఉంటుంది. మనకు ఏ ప్లస్‌ రేటింగ్‌ వచ్చింది. ఈ రేటింగ్‌కు ఈ రోజు వడ్డీరేటు 10.48 శాతంగా ఉంది. మనం చెల్లించేది 10.32 శాతమే. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరఽథ ప్రాజెక్టు నిధులకు 10.5 శాతం వడ్డీరేటు చెల్లిస్తోందిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. దేశంలోని పలు ప్రభుత్వాలు ఈ విధంగా బాండ్లు విడుదల చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌, జీహెచ్‌ఎంసీ వంటివి కూడా బాండ్ల ద్వారా రుణం తీసుకున్నాయి. యూపీ బాండ్లకు ప్రభుత్వ సబ్సిడీలను కూడా సెక్యూరిటీగా పెట్టారు. సాధారణంగా బ్యాంకులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంతోపాటు భూములు కూడా తాకట్టు పెట్టాలి. అమరావతి బాండ్లకు ప్రభుత్వం గ్యారెంటీ మాత్రమే ఇస్తోంది. భూములు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. బాండ్ల జారీలో సీఆర్డీఏ ఎటువంటి తప్పూ చేయలేదు. అప్పు చేయకుండా కేంద్రంలో కూడా ఏ పనులూ జరగవు. జాతీయ రహదారుల నిర్మాణానికి అప్పు తీసుకుంది.” అని కుటుంబరావు అన్నారు. దేశంలోని అన్ని స్థానిక సంస్థలూ కలిపి ఇన్నేళ్లలో విడుదల చేసిన బాండ్ల విక్రయం ద్వారా సమకూరనంత అధిక మొత్తాన్ని ఒక్క అమరావతి బాండ్లు పొందిన సంగతి తెలిసిందే. రూ.1,300 కోట్ల విలువైన ఈ బాండ్లకు జారీ చేసిన గంటలోనే అనూహ్య స్పందన లభించింది. ఒకటిన్నర రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయ్యి రూ.2,000 కోట్లు సమకూరిన విషయం విదితమే. ఈ పరిణామంతో జాతీయ మదుపరుల్లో అమరావతి, సీఎం చంద్రబాబు పట్ల ఎంత నమ్మకం ఉన్నదీ నిర్ధారణ అయ్యింది. స్టాక్‌ మార్కెట్‌ ద్వారా రాజధాని కోసం మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు వీలుగా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల కోసం లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో మరికొద్ది నెలల్లో మసాలా బాండ్లు, అనంతర కాలంలో సాధారణ ప్రజలూ అమరావతి నిర్మాణంలో పాల్గొనేలా రూ.100 ముఖ విలువ కలిగిన బాండ్లను జారీ చేయాలని సీఆర్డీయే యోచిస్తోంది. అందుకే 27నాటి లిస్టింగ్‌ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని చూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com