కేంద్ర ప్రభుత్వ సాయంపై పెదవి విరుపు

దేవ భూమిగా అభివర్ణించే కేరళ ఇప్పుడు కన్నీటి సంద్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సాయంపై మాత్రం ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నారు. దాదాపు పన్నెండు రోజులకు పైగానే కేరళ నీటిలో నానింది. దాదాపు 20 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నది ప్రాధమిక అంచనా. రోడ్లు, కల్వర్లు, వంతెనలు ఇలా ఒక్కటేమిటి జలవిలయానికి అన్నీ ధ్వంసమయ్యాయి. చెట్టూ పుట్టా ఏకమయ్యాయి. కేరళ కు మళ్లీ పాత పరిస్థితి రావాలంటే కొన్ని ఏళ్లు పడుతుందన్నది అంచనా.ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సాయంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటించారు. స్వయంగా ఆయన వరద పరిస్థితిని చూశారు. అధికారులతో సమీక్షించారు. ఐదు వందల కోట్ల రూపాయల ఆర్థికసాయాన్ని మోదీ ప్రకటించారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం కేరళకు వందకోట్ల సాయాన్ని అందించింది. మొత్తం 600 కోట్లు మాత్రమే. కేరళ లో జరిగిన జల విలయాన్ని చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయి ఉడతా భక్తిగా తమకు తోచినంత ఇస్తున్నారు. కానీ రాష్ట్రాలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వానికి మాత్రం సాయం చేయడానికి చేతులు రావడం లేదన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి.కేరళలో జరిగిన విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. కేరళను జాతీయ విపత్తుగా ప్రకటించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీని ఎల్ 3 గానే పరిగణిస్తామని కేంద్రం చెబుతోంది. ఈ మేరకు న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. దీంతో కేరళలో జరిగిన జలవిలయాన్ని జాతీయ విపత్తుగా కేంద్రం గుర్తించదని తేలిపోయింది. కేరళ సాయంపై కేంద్ర ప్రభుత్వ తీరును రాజకీయ పార్టీలు కూడా తప్పుపడుతున్నాయి. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం అరకొర సాయం చేయడ మేంటని? మానవత్వంతో వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు.మరో వైపు కేరళీయులతోనే తమ దేశం అభివృద్ధి చెందిదంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 700 కోట్ల విరాళాన్ని ప్రకటించడం పట్ల సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర దేశం స్పందిచినట్లుగా కేంద్రం సాయాన్ని ప్రకటించకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కేరళలో గత ఇరవై రోజు లనుంచి దాదాపు 771 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో నదులు, వాగులు పొంగాయి. గతంలో ఎన్నడూ జరగని నష్టం కేరళకు జరిగింది. కేరళను ఒకరకంగా పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి. ఈ నెల 30వ తేదీన కేరళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేరళ వరదబాధితులకు సాయం, పునరావాసం, పునర్నిర్మాణంపై చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేరళను ఆదుకునేలా సాయం ప్రకటించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com