ఇలా ఉంటే ఎలా

0
sanitation-apduniaపారిశుధ్య కార్మికులకు ఆరోగ్య భద్రత కొరవడుతోంది. ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అధికారులు వారిపట్ల నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం కార్మికులకు ఇవ్వాల్సిన కనీస పనిముట్లను కాంట్రాక్లర్లు, అధికారులు సకాలంలో అందించడం లేదు. కార్మికులు అపరిశుభ్ర వాతావరణంలోనే విధులను మొండిగా నిర్వర్తించాల్సి వస్తోంది.నగర పాలక సంస్థలో అత్యధిక పారిశుద్య కార్మికులు రోగాల బారిన పడుతున్నారు. చెత్తను ఎత్తివేసే సమయంలో వినియోగించాల్సిన మాస్కులు, బ్లౌజులు, దంతెలు, టబ్బులు తప్పని సరిగా వినియోగించాల్సి ఉంటుంది. వీటిని సరఫరా చేయడంలో మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తునారు. అందువల్ల కార్మికులు విధులు నిర్వర్తించే సమయంలో వాటిని ధరించలేకపోతున్నారు. మాస్కులు లేకుండా దుర్వాసన వెదజల్లే చెత్త కుప్పల వద్ద నేరుగా పని చేయాల్సి వస్తోంది. ఆస్మా వంటి ఊపిరితిత్తుల వ్యాధులతోపాటు అంటు రోగాలకు గురికావాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆసుపత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాలను సాధారణ చెత్తలో కలుపుతున్నారు. వినియోగించిన సూదులు, సిరంజిలు, బ్లేడులు, గ్లూకోజ్‌ బాటిళ్లు కూడా చెత్తకుప్పల్లో ప్రత్యక్షమవుతున్నాయి..గ్లౌజులులేకుండా కార్మికులు పనిచేయడంవల్ల భయంకరమైన వ్యాదులకు సైతం గురయ్యే ప్రమాదం పొంచివుంటుంది.కడప నగర పాలక సంస్థలో పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌ విభాగంలో దాదాపు 250 మంది కార్మికులు శాశ్వత ప్రాతిపదికన, మరో 665 మంది అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో పని చేసే కార్మికులకు అవసరమైన పనిముట్లను అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా వారికి సరఫరా చేయాల్సి ఉంటుంది. దోటి, పార గడ్డపార, పొరక, గంప, రేకు, పొరక, మాస్కులు, బ్లౌజులు, దంతెలు, టబ్బులు, నూనె, సబ్బులను సరఫరా చేయాల్సి ఉంది. ఏజెన్సీలు వీటిని సరాఫరా చేయడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. నాణ్యతలేని కార్మికులకు సరఫరా చేస్తున్నాయి. అందువల్ల తక్కువ కాలంలోనే పనిముట్లు శిథిలమవుతున్నాయి. వీధులు ఊడ్చేందుకు ఇస్తున్న పుల్లల పొరకలు నాణ్యత లేనందువల్ల కనీసం వారం రోజులు కూడా పనిచేయడం లేదు. నెలల తరబడి వాటితోటే పని చేయాల్సి వస్తుంది. ఊసిపోయిన పొరకలతో రోడ్లను ఊడ్వలేక పోతున్న పరిస్థితి నెలకొంటోంది. చెత్తకుప్పలను ఎత్తివేసే పారిశుద్య కార్మికులకు నెలనెలా నూనె సబ్బులు, మాస్కులు, గ్లౌజులు తప్పని సరిగా సరఫరా చేయాలి. వీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత ఆయా ఏజెన్సీలపై ఉంటుంది. ఏజెన్సీ నిర్వహించే వ్యక్తి నగరంలోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువు అవడం వల్ల కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శ ఆ ఏజెన్సీ నిర్వాహుడిపై ఉంది. ఇలాంటి వాటిని పక్కన పెట్టేందుకు అధికారులు సైతం ముందుకు రావడంలేదన్న భావనను కార్మికులు వెలిబుచ్చుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి వారికి నాణ్యమైన పనిముట్లను సకాలంలో అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Share.

Comments are closed.