విపత్తులు,ప్రమాదాల ప్రత్యేక దళాన్ని ప్రారంభించిన కేటీఆర్

నగరంలో విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు హుటాహుటిన స్పందించి సహాయ చర్యలు చేపట్టే ప్రత్యేక దళాన్ని కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని సచివాలయ సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డిజాస్టర్‌ రెస్పాన్స్ ఫోర్స్‌(డీఆర్‌ఎఫ్‌)ను ప్రారంభించి ప్రసంగించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ మహానగర పరిరక్షణ ప్రభుత్వ ప్రాధాన్య అంశమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు అన్ని శాఖల సమన్వయంతో డీఆర్‌ఎఫ్‌ పనిచేస్తుందని కేటీఆర్‌ వివరించారు. ప్రతి జోన్‌కు డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని కేటాయిస్తామని చెప్పారు. నగరంలో అన్ని రకాల మౌలిక వసతులు పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించామని వివరించారు. పోలీసు యంత్రాంగం, ఫైర్‌ శాఖలను మరింత బలోపేతం చేసే విధంగా ఈ డీఆర్‌ఎఫ్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుని దీన్ని రూపొందించామని చెప్పారు. నేరాలను నియంత్రిస్తూ హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరితో కలిసి ముందుకువెళ్తున్నామని కేటీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com