కరుణకు తెలుగుంటే గిట్టదు

తుదిశ్వాస విడిచిన డీఎంకే చీఫ్ కరుణానిధి తెలుగు వారనే విషయాన్ని తెలుగు మీడియా బాగా ఒత్తి చెబుతోంది. ఇది వాస్తవమే. తంజావూరులో స్థిరపడిన ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు కరుణానిధి. తమిళనాట ఇలాంటి ఎన్నో తెలుగు కుటుంబాలుంటాయి. మద్రాస్ స్టేట్, అంతకు పూర్వమే అనేక తెలుగు కుటుంబాలు ఇలా తమిళ ప్రాంతానికి తరలి వెళ్లాయి. అలాగే భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు సరిహద్దు ప్రాంతాలు అటూ ఇటూ కావడంతో.. తమిళనాట తెలుగు వాళ్ల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాలు తెలుగునే తమ ఇళ్లలో వ్యవహరిక భాషగా ఉపయోగిస్తూ ఉంటాయి. దశాబ్దాలు గడిచినా వీరికి తెలుగులో అనుబంధం తెగిపోలేదు. కానీ కరుణానిధి వల్ల చాలా తెలుగు కుటుంబాలు తెలుగుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. తమిళనాట నిర్బంధ తమిళాన్ని అమలు పరిచిన ముఖ్యమంత్రి కరుణానిధి. హిందీ వ్యతిరేక ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన కరుణ..తమిళ ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. తమిళనాట తమిళం మాత్రమే ఉండాలన్నట్టుగా వ్యవహరించారు. పాఠశాలల్లో నిర్బంధ తమిళాన్ని అమలు పరిచింది కరుణానిధి ప్రభుత్వమే. అప్పటి వరకూ తమిళనాట తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో తెలుగులోనే చదువులు సాగేవి. సరిహద్దు ప్రాంతాలలోని పాఠశాలల్లో తెలుగు బోధన కూడా జరిగేది. అయితే కరుణానిధి తెచ్చిన నిర్బంధ తమిళ చట్టంతో తమిళనాట తెలుగు ఉనికి ప్రమాదం తలెత్తింది. దీనికి వ్యతిరేకంగా అక్కడి తెలుగు వారు పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం అయితే తమిళనాట తెలుగు పాఠశాలల సంఖ్య చాలా వరకూ తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన దాదాపు ఆగిపోయింది. తెలుగు వారు మెజారిటీ ఉన్న ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. కొన్ని చోట్ల నామమాత్రంగా తెలుగు పాఠశాలలు ఉన్నాయి. అక్కడ కూడా పదో తరగతి వరకే తెలుగు వారు తెలుగును ఒక భాషగా చదవగలరు. పదో తరగతి తర్వాత వాళ్లు తమిళ మీడియంలో చదువుకోవాల్సిందే. ఫలితంగా.. సరిహద్దు ప్రాంతాల్లో తెలుగు ఉనికి పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. తెలుగువాడు.. అని నేడు కరుణానిధి గురించి మనోళ్లు గర్వంగా చెబుతున్నారు కానీ, కరుణ తెచ్చిన నిర్బంధ తమిళ చట్టం తమిళనాట తెలుగు ఉనికినే లేకుండా చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *