కదలరు.. వదలరు.. (అనంతపురం)

మండలాల్లో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను అమలు చేయాలన్నా… వాటి లబ్ధిదారుల ఎంపికలో ఎంపీడీవో కీలకంగా ఉంటారు. అలాగే ఉపాధి హామీ వంటి ముఖ్యమైన కార్యక్రమాల అమలు కూడా ఎంపీడీవోల ద్వారానే అమలవుతోంది. అటువంటి ఎంపీడీవోల పోస్టులు పూర్తిగా రాజకీయుల వశం అయ్యాయి. ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన ఎంపీడీవోను సుదూరంలో ఉన్నా సరే, తమ నియోజకవర్గానికి తెచ్చుకొని, ఇన్‌ఛార్జిగా కొనసాగేలా చూస్తున్నారు. అప్పటి వరకు అక్కడ ఉన్న ఎంపీడీవోను బలవంతంగా అయినా మరోచోటికి పంపేస్తున్నారు. చాలా కాలంగా ఈ తంతు సాగుతోంది. ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించి అసలు పోస్టుల్లోకి వెళ్లి పనిచేయాలంటూ కచ్చితంగా చెప్పినా.. వారు ససేమిరా అంటున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో బదిలీ చేసిన చోటకు వెళ్లకుండా తాత్సారం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా వారికి వెన్నుదన్నుగా ఉంటూ, అంతా తాము చూసుకుంటామనేలా అభయమిస్తుండటం విశేషం.
జిల్లాలోని 14 మంది ఎంపీడీవోలు అసలు స్థానాల్లో కాకుండా వేరొక చోట ఇన్‌ఛార్జి ఎంపీడీవోలుగా వెళ్లారు. సాధారణంగా ఎవరైనా ఓ ఎంపీడీవోకి, ఏదైనా మండలాన్ని కేటాయిస్తారు. తర్వాత ఇతర కారణాలతో మరొక చోటికి ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇవ్వాలంటే ఆ నియోజకవర్గంలోనో, పక్కనే ఉన్న మండలాల బాధ్యతలో ఇవ్వాలి. కానీ జిల్లాలో మాత్రం కొందరు ఎంపీడీవోల అసలు పోస్టింగ్‌ మండలానికి, ప్రస్తుతం పని చేస్తున్న మండలానికి వందల కిలోమీటర్ల దూరం ఉంటుండటం విశేషం. కొందరు రాజకీయులు చెప్పినట్లు అంతా చేసేలా మాట్లాడుకొని వీరు వేరొక మండలాల్లో బాధ్యతలు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవలే ఆయా ఎంపీడీవోలు పనిచేయాల్సిన అసలు మండల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందికి కొత్త విధానంలో జీతాలు ఇవ్వడం కూడా అవరోధంగా మారింది. కొన్నిచోట్ల మూడు, నాలుగు నెలలుగా సిబ్బందికి జీతాలు అందలేదు. దీంతో ఇటువంటి ఎంపీడీవోలు అందరినీ సొంత స్థానాలకు పంపాలని జిల్లా పరిషత్తు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే నలుగురికి మాత్రం మినహాయింపు ఇవ్వగా, మిగిలిన పది మంది కచ్చితంగా వెళ్లేలా ఉత్తరులు వెలువడ్డాయి. గత నెల 20న ఈ మేరకు ఉత్తర్వులిచ్చినా.. రెండు వారాలు అవుతున్నా సరే… ఎంపీడీవోలు కదలకుండా ప్రస్తుత స్థానాల్లోనే తిష్ట వేసుకొని కూర్చుకున్నారు.
యల్లనూరులో పని చేస్తున్న ఎంపీడీవో విష్ణుప్రసాద్‌ అసలు స్థానం అమరాపురం కాగా, ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులు వచ్చినా వెళ్లలేదు. యాడికిలో పనిచేస్తున్న టి.యోగానందరెడ్డి అసలు స్థానమైన నంబులపూలకుంటకు వెళ్లాలి. ధర్మవరంలో ఉన్న ఎం.వెంకటరాము బుక్కరాయసముద్రానికి, సోమందేపల్లిలో ఉన్న వి.నాగన్న శెట్టూరుకు, శెట్టూరులో ఉన్న రామచంద్ర అనంతపురానికి, తాడిపత్రిలో ఉన్న నెహేమ్యా పుట్లూరుకు, పుట్లూరులో ఉన్న యాదవేంద్ర యల్లనూరుకు, తలుపులలో ఉన్న పోలప్ప నల్లచెరువుకు, ఎన్పీకుంటలో ఉన్న వెంకటరామిరెడ్డి తలుపులకు, ఎస్‌బీఎం కోఆర్డినేటర్‌గా ఉన్న సుధాకర్‌ర్‌రెడ్డి ధర్మవరానికి వెళ్లాల్సి ఉంది. కానీ వీరిలో ఎక్కువ మంది రాజకీయుల సహకారంతో అసలు స్థానాలకు వెళ్లకుండా చూసుకుంటున్నారు. మరికొందరు అసలు స్థానానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా… ఇప్పటికే అక్కడ బాధ్యతలు చూస్తున్న వారు, వీరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మొత్తానికి జిల్లా పరిషత్తు ఇచ్చిన ఆదేశాలనే వీరంతా బేఖాతరు చేస్తుండటం విశేషం. జడ్పీ సైతం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, ముదిగుబ్బ ఎంపీడీవో సూర్యనారాయణ జడ్పీ డిప్యూటీ సీఈవోగా, నల్లమాడ ఎంపీడీవో రాఖారాణి జడ్పీ ఉప విద్యాశాఖాధికారిణిగా, ఉరవకొండ ఎంపీడీవో వెంకటనాయుడు జడ్పీ ఏఈవోగా, యాడికి ఎంపీడీవో వైపీ రమణారెడ్డి జీరో వేస్ట్‌ పంచాయత్‌ ప్రాజెక్ట్‌ జిల్లా కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నందున వీరికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com