కనిపిస్తే కబ్జానే.. (నెల్లూరు)

కాస్త జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు ఇట్టే పాగా వేస్తున్నారు. విలువైన సర్కారు స్థ్థలాలను కబ్జాచేసి దర్జాగా ఉంటున్నారు. రూ.కోట్లు పలికే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణల చెరలో చిక్కుకొన్నాయి. తొలగింపులో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహ రిస్తుండటంతో కబ్జాదారుల కబంధహస్తాల్లోనే ఉంటున్నాయి. దీనికి తోడు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఆక్రమణల తొలగింపునకు మోకాలడ్డుతుండటంతో మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితి చిల్లకూరు మండలంలోని పలు పలు గ్రామాల్లో చోటు చేసుకొంది.

చిల్లకూరు మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. దీనికితోడు ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయి. మరో వైపు జాతీయ రహదారి విస్తరించి ఉంది. అంకణం స్థలం విలువ రూ.1.5లక్షలకు పైగానే పలుకుతుంది. ఎకరం సుమారు రూ.కోటి వరకు ఉంది. ఈ ప్రాంతంలో త్వరలో సాగరమాల, భారత్‌మాల ప్రాజెక్టుల కింద గ్రామాలను అనుసంధానం చేస్తూ నాలుగు వరుసల రహదారుల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వ్యాపార కార్యకలాపాలకు స్థలాలు అనువుగా ఉన్నాయి. పట్టా భూముల్లోని స్థలాలను కొనుగోలు చేయాలంటే ధరలు ప్రియంగా మారాయి. ఈ క్రమంలోనే సర్కారు భూముల ఆక్రమణలకు ఊతంగా మారింది. రూ.లక్షలు విలువజేసే స్థలాలను కొందరు ఎంచక్కా ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. క్రయ విక్రయాలు కూడా చేస్తున్నారు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసినా పట్టించుకొన్న దాఖలాల్లేవు. ఒక్క చిల్లకూరు మండలంలోనే దాదాపు రూ.6 కోట్ల విలువైన స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి.
చిల్లకూరు సమీపంలో జాతీయ రహదారిని ఆనుకొని ఆక్రమణలు వెలుస్తున్నాయి. వరగలి అడ్డరోడ్డు కూడలి ప్రాంతంలో ఉన్న వాగు పొరంబోకు భూమిని పక్కనే ఉన్న ఓ పరిశ్రమ వారు చదును చేసి ఆక్రమించేశారు.ఆక్రమించిన ఈ భూమి అరెకరం పైనే ఉంటుంది. పరిశ్రమలో తయారైన వస్తుసామగ్రిని అక్కడ నిల్వ చేసేందుకు వినియోగించుకొంటున్నారు. దీనికి తోడు టైర్ల పంక్చర్ల దుకాణం ఏర్పాటు చేసుకొనేందుకు ఆక్రమిత స్థలాన్ని అద్దెకు ఇచ్చారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు ఎరుకే.జాతీయ రహదారికి అతి సమీపంలో వరగలి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కుంట పోరంబోకు స్థలాన్ని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో జామాయిల్‌ మొక్కలను నాటి పెంచుతున్నారు.ఇప్పటికే 30అంకణాల వరకు పరాధీనం అయ్యింది. పక్కనే ఓ ప్రైవేటు లే అవుట్ వెలసి ఉండటంతో ఇక్కడి స్థలానికి మంచి గిరాకీ ఉంది. ఈ కుంటను జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద పనులు చేసి ఉండటం గమనార్హం. స్థలాన్ని ఆక్రమించేందుకు గతంలో ప్రయత్నాలు చేసిన వైనాన్ని అధికారులు అడ్డుకొన్నారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదుకానీ మిన్నుకుండి పోయారు.
ముత్యాలపాడు గ్రామానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన డొంకలో కొంత స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసుకొనేందుకు గోడను నిర్మించారు.ఇక్కడ 25అంకణాల స్థలం ఆక్రమణకు గురయ్యింది. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితంలేదు. స్థానికంగా ఉన్న ఓ నాయకుడు తమ వర్గానికి చెందిన వ్యక్తి అని ప్రజా ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆక్రమణ జోలికి వెళ్లొద్దంటూ ఆయన అధికారులకు సూచించారు. ఇక చేసేదిలేక రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com