మహాకూటమి బలంగా ఉన్న చోట్ల జనసేన పోటీ…?

0

తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ వేగం పెంచేశాయి. ఒకవైపు టీఆర్ఎస్.. మరోవైపు మహాకూటమి ఎత్తుకు పైఎత్తు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. వీటికి తోడు భారతీయ జనతా పార్టీ, మజ్లీస్, సీపీఎం సహా మరికొన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తాయా..? లేదా..? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, వైసీపీ నేతలు దీనిపై ఎటువంటి క్లారిటీ ఇచ్చేశారు. కొద్దిరోజుల కిందట ఈ విషయంపై పవన్ మాట్లాడాడు. తెలంగాణలో సాధారణ ఎన్నికలే జరిగితే అన్ని స్థానాల్లో కాకుండా 23 స్థానాల్లోతో పాటు మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నామని చెప్పాడు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడంతో దీనిపై పునరాలోచన చేస్తున్నామని ఆయన వెల్లడించాడు. మరోవైపు, ముందస్తు ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందంటూ ఓ వార్త బయటికొచ్చింది.వాస్తవానికి ముందస్తు ఎన్నికలను అంచనా వేయలేకపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణను లైట్ తీసుకున్నారు. అందుకే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా పర్యటించకపోగా, నాయకులను కూడా పెద్దగా చేర్చుకున్నది లేదు. అయితే, కొద్దిరోజుల కిందట ముందస్తు ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలనే అంశం మ్మీద జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్‌)తో తమ పార్టీ కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే, తెలంగాణ ఎన్నికల్లో పాల్గొంటే ఆ ప్రభావం ఏపీలో జరగబోయే ఎన్నికలపై కూడా పడుతుందని ఆ పార్టీ అధిష్ఠానం భావించి ఈ ప్రయత్నాలను ఆపేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా తెలంగాణలోని చాలా మంది జనసేన నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్‌ను అడుగుతున్నారట. అన్నీ తాము చూసుకుంటామని, మీరు ఒక్కసారి ప్రచారానికి వస్తే చాలాని ఒత్తిడి తెచ్చారని సమాచారం. దీనిపై సమాలోచనలు చేసిన జనసేనాని మహాకూటమి కూడా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన మహాకూటమిలోని బడా నేతలు పోటీ చేసే స్థానాల్లోనే పోటీ చేయబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది.

Share.

About Author

Leave A Reply