దేవాదాయ శాఖకు దుర్గుగుడి పంచాయితీ

0

వరుస వివాదాలతో దుర్గగుడి పరువు రోడ్డున పడుతోంది. దేవస్థానంలో ఈవో, ఏఈఓల మధ్య ఏర్పడిన వివాదం దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటోంది. గతంలో దేవస్థానంలో చిన్నపిల్ల తప్పిపోయి దొరకడం, చీర మాయం కేసు, డార్మెటరీలలో సీసీ కెమెరాల వివాదాలు మరిచిపోక ముందే తాజాగా ఈవో, ఏఈవోల వివాదం తెరపైకి వచ్చింది. ఒకదాని తరువాత ఒకటి వివాదాలతో దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటోదని భక్తులు వాపోతున్నారు.దసరా ఉత్సవాల్లో సాంస్కృతిక కళాకారులకు ఇచ్చే మెమెంటోల కొనుగోలులో అవినీతి వ్యవహారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈవో)కి, సహాయ కార్యనిర్వహణాధికారి(ఏఈవో)కి మధ్య వివాదానికి దారితీసింది. ఏఈవో అచ్యుత రామయ్యను ఈవో వి.కోటేశ్వరమ్మ సస్పెండ్‌ చేయడమే కాకుండా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్‌ నెలాఖరుకు రిటైరయ్యే అచ్యుతరామయ్య చివర రోజుల్లో సస్పెండ్‌కు గురి అవ్వడం జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు.దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మకు తనను సస్పెండ్‌ చేసే అధికారం లేదని, తాను ఏ తప్పు చేయలేదని ఏఈవో అచ్యుత రామయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన హైకోర్టులో కేసు వేశారు. తనను విధుల్లో కొనసాగించాలని కోరారు. ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు పెండింగ్‌లో పెట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని, ఈవో కోటేశ్వరమ్మను హైకోర్టు కోరినట్లు సమాచారం.ఏఈవో అచ్యుత రామయ్య వేసిన కేసుపై అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి సమాధానం ఇస్తారా? లేక కేసు సాగదీస్తారా? అని ఇంద్రకీలాద్రిపై చర్చ జరుగుతోంది. దుర్గగుడిలో కేసులు నమోదైతే దాన్ని సాధ్యమైనంత వరకు సాగదీసి చివరకు సమాధానం ఇస్తారు. ఇటీవల పాలక మండలి నుంచి సస్పెండైన కోడెల సూర్యకుమారి, హైకోర్టుకు వెళ్లారు. దీనిపై ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు న్యాయస్థానానికి సరైన సమాచారం ఇవ్వలేదు.మరో వైపు వి.కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు పై వన్‌టౌన్‌ పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. మెమెంటోలు కొనుగోలులో గోల్‌మాల్‌ వ్యవహారంతో పాటు ఈవోను ఏఈవో అచ్యుతరామయ్య బెదిరించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా తొలుత మెమెంటోలు సరఫరా చేసిన అనూష హ్యండీ క్రాఫ్ట్‌ నిర్వాహకుడు రమేష్‌ను పిలిచి విచారించారు. ఎన్ని ఆర్డర్‌ ఇచ్చారు? ఎన్ని సరఫరా చేశారు? ఎంతకు బిల్లు తీసుకున్నారు? రమేష్‌తో ఈ వ్యవహారంలో ఎవరెవ్వరూ మాట్లాడారు తదితర సమాచారం పోలీసులు సేకరించారు. ఈ కేసులో మరొక ఆరుగురిని పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.

Share.

About Author

Leave A Reply