నిధులున్నా నిర్లక్ష్యమేనా.. (మహబూబ్ నగర్)

ఆస్పత్రుల అభివృద్ధికి నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది.. ప్రతి ఏడాది ఇదే తీరుగా ఉంది.. ఇక విడుదల చేసిన నిధులు ఖర్చు చేయడంలో క్షేత్రస్థాయిలో వైద్యాధికారులు.. సిబ్బంది వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది.. ఫలితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతుల కల్పనలో జాప్యం జరుగుతుంది.. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం పారిశుద్ధ్య నిధులను మాత్రమే అధికారులు విడుదల చేశారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా ఇంకా రాలేదు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులకు ప్రభుత్వం ఇస్తున్న నిధులు సకాలంలో విడుదల చేయడం లేదు. ఆర్థిక సంవత్సరం మధ్యలో ఓసారి, ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో మరో విడత నిధులు విడుదల చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో, మధ్యలో నిధులు విడుదల చేస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిధులు ఖర్చు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి ఏడాదికి రూ.1.75 లక్షలు, ఏరియా ఆస్పత్రులకు రూ.2.50 లక్షలు, జనరల్‌ ఆస్పత్రికి రూ.5 లక్షలు విడుదల చేస్తారు. గత ఏడాది కాలంగా ప్రభుత్వం నిధులు పెంచి ఇస్తుంది. అయితే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి రూ.60 లక్షల నిధులు అభివృద్ధి కోసం ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించారు. ఇంకా నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. జాతీయస్థాయి కాయకల్ప అవార్డుల కోసం మిడ్జిల్‌, మరికల్‌ ఆస్పత్రులు వెళ్తుండటంతో వాటి అభివృద్ధి కోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తుగా అభివృద్ధి నిధులు మంజూరు చేశారు.
ఆస్పత్రులకు ఇచ్చిన అభివృద్ధి నిధులు ఖర్చు చేయడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇప్పటికి కూడా బ్యాంకు ఖాతాల్లో రూ.43,34,000లు మూలుగుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది విడుదల చేసిన నిధుల్లో కేవలం యాభై శాతం నిధులు మాత్రమే అధికారులు ఖర్చు చేస్తున్నారు. మిగులు బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే మాత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు మెరుగు పడేందుకు అవకాశం ఉంది. ఆస్పత్రులకు ఇచ్చిన నిధులను పారదర్శకంగా వినియోగించేందుకు ప్రభుత్వం పీహెచ్‌సీ, సీహెచ్‌సీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వైద్యులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు ఏర్పాటు చేయాలి. అందులో ఆస్పత్రిలో ఉన్న నిధులు, అవసరాలు.. వేటికి వినియోగించాలనే విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ప్రతి సమావేశంలోనూ రాజకీయంగా తప్ప ఆస్పత్రి అభివృద్ధిపై చర్చలు జరగడం లేదు. ఇది అదనపు సమస్యగా ఉందని ఆస్పత్రుల్లో వైద్యాధికారులు సమావేశాలు నిర్వహించడం మానేశారు. చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అసలు సమావేశాలు నిర్వహించడం లేదని అధికారుల పరిశీలనలో గుర్తించారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించి సమావేశాలు ఏర్పాటు చేసి నిధులు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వర్షాకాలం ప్రారంభమవడంతో అధికారులు పారిశుద్ధ్య నిధులు విడుదల చేశారు. ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్యలు వస్తే వెంటనే వాటిని వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలకు కలిపి మొత్తం రూ.90,61,000 నిధులను అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు అధికారులు వాటిని ఎలా వినియోగించుకోవాలనే నిబంధనలను సైతం రూపొందించారు. అయితే ప్రతి ఏడాది విడుదల చేసిన పారిశుద్ధ్య నిధుల్లో 40 శాతం నిధులు మిగిలిపోతున్నాయి. ఇలా సుమారు ఇంకా ఖాతాల్లో రూ.30 లక్షల మేర నిధులు నిల్వ ఉన్న పరిస్థితి ఉంది. ఈసారైనా ఈ నిధుల వినియోగమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *