సొంతింటి కల నెరవేరేనా?

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కరీంనగర్ ప్రాంతంలో నత్తనడకన సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న తపనతోనే కేంద్రం ఈ పథకం ప్రారంభించింది. అయితే కరీంనగర్ లో మాత్రం ఈ లక్ష్యం నీరుగారుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి కరీంనగర్ ప్రాంతంలో పేద, మధ్య తరగతి, ప్రభుత్వ, ప్రైయివేటు ఉద్యోగం అనేదీ తేడా లేకుండా ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించారు. పట్టణాల్లో భారీగా దరఖాస్తులు స్వీకరించారు. ఇలా స్వీకరించిన దరఖాస్తుల సంగతిని పట్టించుకోవడంలేదని దీంతో ఇళ్ల విషయం సందిగ్ధంలో పడిందని అంతా అంటున్నారు. నగరాలు, పట్టణాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు సొంతిల్లు నిర్మించుకోవడం ఆర్ధికభారంగా మారింది. దీంతో కేంద్రం 2022నాటికి ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌ నగరపాలక సంస్థతో పాటు హుజురాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల్లో గతేడాది ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద డివిజన్లు, వార్డుల వారీగా అందరికీ ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులు తీసుకుంటుండడంతో లబ్ధిదారుల్లో కొండంత ఆశ కనిపించింది. సొంతిల్లు వస్తుందని అంతా సంబరపడ్డారు. అయితే.. దరఖాస్తుల పరిశీలన ఎప్పుడు చేస్తారు? ఎవరిని లబ్ధిదారులుగా పరిగణిస్తారు? అనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో నిరాశ నెలకొంది.

వాస్తవానికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా ఇల్లు వస్తుందన్న ఆశతో ప్రతి ఒక్కరూ దరఖాస్తు ఇచ్చారు. ఇంటి స్థలం ఉన్న వారు రుణాల కోసం.. ఇల్లే లేని వారు ఎప్పుడు ఇంటిని మంజూరు చేస్తారా? అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లకు అర్హులు ఎక్కువగా ఉన్నారు. దీంతో అసలే ఇల్లు లేని వారు, మురికివాడల్లో నివసిస్తున్న వారికే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఫలితంగా ఇల్లు లేక అద్దె భవనాల్లో ఉంటున్న వారికి పీఎంఏవై పథకం ఊరటగా ఉంది. కానీ లబ్దిదారుల ఎంపికలో మాత్రం తీవ్ర జాప్యం నెలకొంటోంది. వీవీఎన్‌ కన్సల్టెన్సీతో పాటు పలు సంస్థలు ఈ దరఖాస్తులన్నింటీని సేకరించి కేంద్రానికి ఆన్‌లైన్‌ ద్వారా పంపించారు. ఇందులో అర్హులను గుర్తించడానికి సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఆ దిశలో చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో ఎలాంటి విషయాలు తెలియకపోవడంతో ఆ దరఖాస్తుదారులు అయోమయానికి గురి అవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పీఎంఏవై పథకం అమలులో స్పందించి చర్యలు తీసుకోవాలని అంతా అంటున్నారు. లబ్ధిదారులందరికీ సొంత ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com