వడ్డీ వర్తింపు లేక..విముఖత!

మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది. వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడమే కాక ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండేలా పలు పథకాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే స్వశక్తి సంఘాలకు వడ్డీలేని రుణాలు అందేలా చూస్తోంది. అయితే ఈ పథకం మొదట్లో సమర్ధవంతంగా సాగినా ప్రస్తుతం ఆ పరిస్థితిలేదు. వడ్డీ వర్తింపు లేకపోవడంతో పలువురు రుణాలు తీసుకునేందుకు ముందుకురావడంలేదన్న కామెంట్స్ కరీంనగర్ జిల్లాలో వినిపిస్తున్నాయి. స్వశక్తి సంఘాల సభ్యులు స్వయం ఉపాధి పనులు చేపట్టడానికి, పిల్లల చదువులు, పెళ్లిళ్లు తదితర కుటుంబ అవసరాలు తీర్చుకోడానికి స్త్రీనిధి, ఆయా బ్యాంకుల నుంచి లోన్స్ ఇస్తున్నారు. అయితే వడ్డీ వర్తింపు లేకపోవడంతో ఆర్ధిక భారం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తరహా రుణాలకు పలువురు మహిళలు విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. జిల్లాలోని మల్యాల మండలం విషయానికొస్తే.. ఈ మండలం పరిధిలో 19 గ్రామాలున్నాయి. వీటిలో 930 స్వశక్తి సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో సుమారు 11,168 మంది సభ్యులున్నారు. జగిత్యాల జిల్లాలోని 13,734 స్వశక్తి సంఘాల్లో 1,62,522 మంది సభ్యులున్నారు. వీరంతా ఆర్ధికంగా కొంత వెనకబడినవారే. వడ్డీలేని రుణాలు ఉంటే వీరికి ఆర్ధిక భారం ఉండదు. అదే వడ్డీ ఉంటే మాత్రం వారికి కష్టంగానే ఉంటుంది.
ఇదిలాఉంటే స్వశక్తి సంఘాల సభ్యులకు 13 శాతం వడ్డీపై అందజేసే రుణాలపై ప్రభుత్వం వడ్డీమాఫీ చేస్తుంది. కానీ 2016 నుంచి వడ్డీమాఫీ లేకపోవడంతో అదనంగా కిస్తులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మహిళలు వాపోతున్నారు. స్వశక్తి మహిళలు బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలు 98 శాతం రికవరీ ఉన్నా ప్రభుత్వం వారికి వర్తింపజేయాల్సిన వడ్డీమాఫీ అమలు చేయడంలేదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఏటా సుమారు రూ.50 లక్షల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని చెప్తున్నారు. వాస్తవానికి 2015-16లో రూ43.79లక్షలు మాఫీ కావాల్సి ఉంది. 2016-17లో 70.87లక్షలు, 2017-18లో రూ.48.69లక్షలు, 2018-19లో 6.75లక్షల వడ్డీమాఫీ కావాలి. జిల్లాలో సుమారు రూ.50కోట్ల వడ్డీమాఫీ అవ్వాల్సి ఉంది. మాఫీ కావాల్సిన మొత్తం అధికంగానే ఉంది. ఈ భారం లబ్ధిదారులపైనే పడుతుండడంతో వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వంపై విశ్వాసంతో రుణాలు తీసుకున్న తమపై అదనపు ఆర్ధిక భారం పడినట్లైందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని తమపై ఆర్ధిక భారాన్ని తప్పించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com