కేసు ఉపసంహరించుకుంటే 15 రోజుల్లో పాలమూరు పనులు

రెండేళ్ల క్రితం కాంగ్రెస్‌ నాయకులు వేసిన కేసును ఉపసంహరించుకుంటే 15 రోజుల్లోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం పరిగిలో పార్టీ పతాకావిష్కరణ, వీఎంఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అభ్యర్థులకు పుస్తకాల పంపిణీ, లక్నాపూర్‌లో ప్రాజెక్టు వద్ద మినీ ట్యాంకు బండ్‌ పనులను హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డితో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేసును కొట్టివేసే దిశగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఆలస్యమైనా పర్యావరణ అనుమతి సాధించి ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్‌ నాయకులు తాము వేసిన కేసును ఉపసంహరించుకుంటే పక్షం రోజుల్లో కాలువ పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం హోంమంత్రి నాయిని మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. పోలీసు ఉద్యోగాల విషయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. మంత్రి మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో అన్ని రంగాలుగా ముందుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మహేశ్‌ రెడ్డి, వీఎంఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు మనోహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com