ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారం వాయిదా?

పాకిస్థాన్‌ ప్రధానమంత్రిగా పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. పాక్‌ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఆయన 21వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని ఆ దేశ న్యాయశాఖ మంత్రి అలీ జాఫర్‌ డాన్‌ పత్రికతో చెప్పినట్లు తెలుస్తోంది. తొలుత ఆగస్టు 11న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.‘ఈనెల 11 లేదా 12 తేదీల్లో నేషనల్‌ అసెంబ్లీ సమావేశమై.. కొత్త ప్రధానమంత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రకటిస్తారు. అందువల్లే ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారం పాక్‌ స్వాతంత్ర్య దినోత్సవం(ఆగస్టు 14) రోజున జరిగే అవకాశం ఉంది’ అని న్యాయశాఖ మంత్రి జాఫర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఇమ్రాన్‌ ప్రమాణస్వీకారం వాయిదా పడటం పట్ల పీటీఐ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.గత నెల 25న జరిగిన పాకిస్థాన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో పీటీఐ పార్టీ 116 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే పాక్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 172మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో చిన్న పార్టీల మద్దతుతో పీటీఐ అధినేత పాక్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని, చాలా నిరాడంబరంగా జరుపుతున్నట్లు పీటీఐ వెల్లడించింది. విదేశాల్లోని ఖాన్‌ స్నేహితులకు మాత్రం ఆహ్వానాలు పంపించారు. భారత్‌ నుంచి పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ హాజరవనున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com