యువజన విభాగం భారీ ర్యాలీ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ వంచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాత జైలు రోడ్డులో భారీ ర్యాలీ చేపట్టారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువజన, విద్యార్థి విభాగాలు కదం తొక్కాయి. వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఓట్ల కోసం తప్పుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును యువకులే రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేస్తారని హెచ్చరించారు. పార్టీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 65 లక్షల మందికి పైగా ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతుంటే.. 10 లక్షల మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తాననడం ఎంత వరకు సబబు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పక్కాగా అమలు చేసిన ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ పథకాన్ని చంద్రబాబు అధికారంలో వచ్చాక నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి కింద రూ.2వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ.1000 అందిస్తామనడం చంద్రబాబు మాట మీద నిలబడడని చెప్పడానికి నిదర్శనమన్నారు.2019లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేక ఆంక్షలతో రూ.1000 నిరుద్యోగ భృతి అంటూ మరోమారు మోసం చేయడానికి రంగం సిద్ధం చేశారని ఆక్షేపించారు. విశాఖ పార్లమెంట్‌ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు కోటి ఆశలతో తమ పిల్లలను అప్పులు చేసి చదివిస్తే నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్‌లు ఇవ్వకుండా కాలక్షేపం చేశారని ధ్వజమెత్తారు.సక్రమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయకుండా పేద విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ యువతకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. అసలు లేనిది ఉన్నట్లుగా, చేయనవి చేసినట్లుగా ఊహించుకునే అల్జిమర్స్‌ వ్యాధి చంద్రబాబుకు, లోకేష్‌కు ఉందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. రాలీ అనంతరం పార్టీ నాయకులు కలెక్టరేట్‌కు వెళ్లి డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *