డీఎంకేలో వారసత్వ పోరు ఇవాళ డీఎంకే అత్యవసర సమావేశం

కరుణానిధి మరణం తర్వాత డీఎంకే పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు. తమిళనాడులో మొదలైన చర్చ ఇది. ఈ రేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన్ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికోవడం లాంఛనమే అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఉన్నట్టుండి కరుణ పెద్ద కుమారుడు అళగిరి కూడా తెరపైకి వచ్చారు. ఈ రేసులో తాను ఉన్నానంటూ పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. సోమవారం ఉదయం తన తండ్రి స్మారకం దగ్గర నివాళులర్పించిన అళగిరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా తండ్రికి నిజమైన సన్నిహితులు, మద్దతుదారులు నావెంటే ఉన్నారు. కాలమే దీనికి సమాధానం చెబుతుంది. నా అసంతృప్తిని తండ్రితో చెప్పుకోవడానికి వచ్చానన్నారు. అళగిరి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే.. తనకు డీఎంకేలో ఫాలోయింగ్ ఉందని.. కేడర్ తన వెంట కూడా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే అసంతృప్తి, కాలమే నిర్ణయిస్తుంది అనడంతో.. ఆయన కూడా పార్టీ అధ్యక్షుడి రేసులో ఉన్నానంటూ పరోక్షంగా చెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డీఎంకేలో అళగిరికి కూడా మంచి పట్టుంది. మదురై నుంచి 2009లో ఎంపీగా గెలిచి.. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత పరిస్థితులు మారిపోవడంతో.. అళగిరి పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే స్టాలిన్‌ను కరుణానిధి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించి.. తన రాజకీయ వారసుడని చెప్పకనే చెప్పారు. అప్పటి నుంచి స్టాలిన్ పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ.. పార్టీలో కూడా పట్టు పెంచుకున్నారు. ఇప్పుడు కరుణానిధి మరణంతో మళ్లీ డీఎంకే బాధ్యతలు ఎవరు చేపట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై చర్చించేందకు మంగళవారండీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా సమావేశంకాబోతోంది. ఈ సమావేశంలోనే స్టాలిన్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో అళగిరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపగా.. మంగళవారం జరిగే సమావేశంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే ఉత్కంఠ కూడా మొదలయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com