భారీగా పెరుగుతున్నఎరువులు వినియోగం

తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల వినియోగం భారీగా పెరిగింది. అధిక దిగుబడుల కోసం రైతులు ఎరువులను విచ్చలవిడిగా వాడుతుండడంతో భూములు సారాన్ని కోల్పోతున్నాయి. ఒక్క ఏడాది కాలంలోనే 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించారు. సాధారణంగా వానాకాలం సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. యాసంగిలో మాత్రం సగానికి పైగా విస్తీర్ణం తగ్గుతుంది. 2016-17 ఏడాది వానాకాలంలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, యాసంగికి 9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు వాడారు. 2017-18 సంవత్సరానికి సంబంధించి వానాకాలంలో 17 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు పంటల సాగులో వినియోగించారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల వారీగా చూస్తే.. వాస్తవంగా వినియోగించాల్సిన మోతాదును మించి ఎరువులను వాడినట్టు తెలుస్తోంది. ఫలితంగా ఈ ఎరువుల ప్రభావం భూములను నిస్సారంగా చేయడంతో పాటు, మందు పంటలను తింటున్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉండకపోవడం, ఆఫీసుల చుట్టూ తిరిగే తీరిక రైతులకు లేకపోవడంతో.. మందుల దుకాణదారునే ఏ మందు వాడాలో చెప్పమని రైతులు కోరుతున్నారు. ఇదే అదునుగా మోతాదుకి మించి, నాణ్యతలేని ఎరువులను అధిక ధరలకు రైతులకు అంటగడుతున్నారు. ఎరువుల కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి.. తమ ప్రొడక్ట్స్‌ను అమ్మితే ప్రత్యేక ఆఫర్లు, బహుమతులు, టూర్లు అంటూ దుకాణదారులు, డీలర్లను ఆకర్షిస్తున్నాయి. వాటికి ఆకర్షితులై దుకాణదారులు రైతులను మోసం చేస్తున్నారు.రాష్ట్రంలోని సాగు భూముల్లో వ్యవసాయ శాఖ భూసార పరీక్షలు నిర్వహించి.. రైతులకు భూసార కార్డులను అందజేస్తుంది. ఈ కార్డుల ఆధారంగా రైతులు తగిన ఎరువులను పంటల సాగుకు వినియోగించాల్సి ఉంటుంది. కానీ, వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించడం తప్ప.. కార్డులను జారీ చేసిన దాఖాలాల్లేవు. ఏటా వేసవిలో మాత్రం రైతుల భూముల్లోంచి నమూనాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆయా జిల్లాల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబులను సైతం ఏర్పాటు చేశారు. గతేడాది మండలాలు, గ్రామాల వారీగా భూసార పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తిదారుల నుంచి ల్యాబుల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించారు. అయినా, నేటి వరకు భూసార పరీక్షల కార్డులు రైతులకు అందలేదు.రైతులు ఏ పంటకు ఏ ఎరువు వేయాలి? ఎంత పరిమాణంలో వేయాలి? వంటి వివరాలను వ్యవసాయ శాఖ అధికారి ఒక చిటీపై రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ చిటీ ఆధారంగా ఎరువులను ఫెస్టిసైడ్స్ కంపెనీలు రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. రైతులు ఏం ఎరువులు వాడాలనేది తెలుసుకునేందుకు వ్యవసాయాధికారి కార్యాలయానికి వచ్చిన సమయంలో ఇతర పనుల్లో సదరు ఏఓ బీజీగా ఉన్నారని తర్వాత రమ్మని చెప్పి పంపుతున్నారు. అసలే వ్యవసాయ పనుల్లో తీరికలేకుండా ఉండే రైతులు కార్యాలయాల చుట్టూ తిరగడం అసాధ్యం. దీంతో పాటు వ్యవసాయ అధికారులు చాలామంది ఎరువుల్లో ఉండే ఫార్ములాను మాత్రమే చిటీపై రాస్తున్నారు. దీంతో ఫెస్టిసైడ్స్ దుకాణదారులు లాభం ఎక్కువగా ఉండే ఎరువులను రైతులకు అంటగడుతున్నారు.రసాయన ఎరువులను వాడడంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా రసాయనిక ఎరువులను విక్రయిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల ప్రజలు కేన్సర్ బారిన పడుతున్నారు. ఆహార పదార్థాలు కలుషితమవ్వడంతో పాటు వాతవరణం సైతం కాలుష్యమవుతోంది. ఏటేటా రసాయన ఎరువుల ప్రభావం మానవాళిపై విపరీతంగా పెరుగుతోంది. ఇకనైన రసాయన ఎరువుల వినియోగాన్ని నిలువరించకపోతే భవిష్యత్తులో విపరీత పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆయా ప్రభుత్వాలు సేంద్రియ పంటల సాగు విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. సిక్కిం రాష్ట్రం ఈ విషయంలో ఎంతో ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో రైతులు పంటల సాగు కోసం రసాయనిక ఎరువులను ఏమాత్రం వాడరంటే అతిశయోక్తి కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com