వంశధారకు భారీగా చేరుతున్న వరద నీరు

శ్రీకాకుళం జిల్లాల్లో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 3 గంటల్లో వంశధారకు 80 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరింది. దీంతో అధికారులు వంశధార ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏ క్షణంలోనైనా వరద ముంచుకు రావచ్చని వంశధార ప్రాజెక్ట్ ఎస్ఈ సూచించారునాగవావళికి ప్రతి గంటకు పదివేల క్యూసెక్కుల వంతున వరదనీరు ప్రవాహం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 35వేల క్యూసెక్కులు నమోదు కాగా, నాలుగు గంటలకు 41వేలు, ఐదు గంటలకు 50వేల క్యూసెక్కులు నమోదైంది. తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జలాశయంలో 104.2 మీటర్లు స్థాయిలో నీటిని నిల్వ ఉంచుతున్నారు. కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు విడుదల చేస్తూనే, నదిలోనికి నీరు వదులుతున్నారు.వరదలు రెండోవైపు ప్రజలను అత్యంత దారుణంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రజలు ఆక్రోశిస్తున్నారు. కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో 25 ఎకరాలు పంటపొలాలు నీట మునిగాయి. నదికి వరదకట్టలు ఏర్పాటుచేసి, తమ పొలాలకు పరిహారం ఇవ్వకపోవడంతో నదిలోనే వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటివరకు నదిలో ఆయిలు ఇంజిన్లు పెట్టి నీరును తోడుకొని సేద్యం చేస్తూ వచ్చామని, మంగళవారం రాత్రినుంచి కురిసిన వర్షాలకు వరదనీరు వచ్చి చేరడంతో పంటలతో పాటుగా ఇంజిన్లు కూడా నీట్లో మునిగిపోయాయని వారు తెలిపారు. తమ పరిస్థితులను పరిశీలించేందుకు అధికారులు కనీసం ఇటువైపు రావడంలేదని ఆక్షేపిస్తున్నారు. గత ఏడాది వరదలకు ఇసుక మేటలు వేసి, పూర్తిగా పంట చేతికి అందకుండా పోయిందని తెలిపారు. తమ కష్టనష్టాలు ఎవరి కంటికి కనిపించడంలేదని వాపోతున్నారు. ఒకవైపు జ్వరాలతో ఆందోళన చెందుతున్న ఈగ్రామ ప్రజలకు వరదలు ఇప్పుడు ఇబ్బందుల్లోకి నెట్టేశాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com