ఇలా అయితే కష్టం (అనంతపురం)

జిల్లాలో చేనేత కార్మికుల కష్టాన్ని కొంత వరకు తీర్చి, వారు సులువుగా పని సాగించేందుకు వీలుగా యంత్రాలను సరఫరా చేయాలనుకున్నారు. దరఖాస్తు చేసుకున్న నేతన్నలు.. వాటిని ఎప్పుడిస్తారా? అని ఎదురు చూస్తున్న తరుణంలో, వాటి ధర ఎంత అనేది ఖరారు చేశారు. దీనిని చూసి వారంతా పెదవి విరుస్తున్నారు. జిల్లాలో తక్కువ ధరకు లభిస్తున్న యంత్రాలను దాదాపు రెట్టింపు ధరలకు అంటగట్టేయత్నం చేస్తున్నారని పేర్కొంటున్నారు.
జిల్లాలో ఆదరణ-2 పథకం కింద వివిధ వెనుకబడిన సామాజికవర్గాల వారికి పలు యంత్రాలను తక్కువ ధరకే ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా జిల్లాలోనే చేనేత కార్మిలకు కూడా పలు యంత్రాలు ఇవ్వాలనుకున్నారు. తొలుత చేనేత కార్మికులకు గుంతమగ్గం, స్టాండ్‌ మగ్గం, వస్త్రం దోనె, 120 హుక్స్‌ జాకార్డ్‌ విత్‌ క్రాంక్‌ ఇవ్వాలనుకున్నారు. సాధారణంగా ఈ జాకార్డ్‌ యంత్రాలను ఆయా నేసే వస్త్రాలపై డిజైన్ల్‌ వేసేందుకు ఉపయోగిస్తారు. 120 హుక్స్‌ జాకార్డ్‌ యంత్రాలైతే అడ్డ పంచెలు, టవల్‌, కాటన్‌ చీరలపై డిజైన్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. జిల్లాలో ఎక్కువగా పట్టు చీరలనే నేస్తుంటారు. ఈ చీరల అంచుల్లోనూ, మధ్యలోనూ, కొంగు, పల్లు వద్ద డిజైన్లకు 240 హుక్స్‌ జాకార్డ్‌ అయితేనే ఉపయోగం ఉంటుంది. ఒక్కో మగ్గంపై 240 హుక్స్‌ జాకార్డ్‌ యంత్రాలు రెండు లేదా మూడింటిని ఏర్పాటు చేసి, పట్టు చీరలు నేస్తుంటారు. అయితే ప్రభుత్వం 120 హుక్స్‌ జాకార్డ్‌ యంత్రాలను ఇవ్వాలనుకోవడంతో.. వాటితో జిల్లాలో ఉపయోగం లేదని వాటి బదులు 240 హుక్స్‌ జాకార్డ్‌ యంత్రాలు ఇవ్వాలని జిల్లా చేనేత జౌళిశాఖ అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం అన్ని జిల్లాల్లో పరిశీలన జరిపి.. దాదాపు నేతన్నలు అందరి వద్ద 240 హుక్స్‌ జాకార్డ్‌ యంత్రాలు ఉన్నందున.. వారందరికీ మోటరైజ్డ్‌ లిఫ్టింగ్‌ యంత్రాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకున్నారు.
సాధారణంగా ఒక్కో 240 హుక్స్‌ జాకార్డ్‌ యంత్రం బరువు దాదాపు 25 కేజీలు ఉంటుంది. అంటే ఒక్కో మగ్గంపై రెండు నుంచి మూడు జాకార్డ్‌లు వినియోగిస్తుండటంతో వాటి బరువు, నేత కార్మికుడిపై భారంగా ఉంటుంది. దీంతో వీటిని సులువుగా పైకి లేపేందుకు వీలుగా మోటరైజ్డ్‌ జాకార్డ్‌ లిఫ్టింగ్‌ యంత్రాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి జాకార్డ్‌ యంత్రాలు తదితరాలు ఇస్తారనుకుంటే, కేవలం లిఫ్టింగ్‌ యంత్రాలు ఇవ్వడం ఏమిటని నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ యంత్రంలో డ్రాబాక్సు కాకుండా, బెల్టు ఉండటంతో తరచూ బెల్టును మార్చుకోవాల్సి వస్తుందనీ, దీంతో అదనపు ఖర్చుతో పాటు యంత్రం మరమ్మతుకు గురవుతుందని చెబుతున్నారు.
మోటరైజ్డ్‌ జాకార్డ్‌ లిఫ్టింగ్‌ యంత్రం ధరపై చేనేత కార్మికుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ప్రభుత్వం పంపిణీ చేయాలనుకున్న లిఫ్టింగ్‌ యంత్రం ధర రూ.18,500గా అధికారులు ఖరారు చేశారు. గత నెలలో జిల్లా కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించి దీని ధర ఖరారు చేశారు. వీటి సరఫరాకు ముగ్గురు తయారీదారులు ముందుకురాగా, వీరిలో కొందరు ఒక్కో యంత్రం రూ.23 వేల నుంచి రూ.25 వేలకు సరఫరా చేస్తామంటూ కొటేషన్లు వేశారు. వీటిపై అధికారులు చర్చలు జరిపి, చివరకు రూ.18,500 ధర ఖరారు చేశారు. ఇందులో లబ్ధిదారుని వాటా 10 శాతం కింద రూ.1,850 చెల్లించాలి. మరో 20 శాతం అంటే రూ.3,700 లబ్ధిదారునికి బ్యాంకు రుణం ఇవ్వాలి. మిగిలిన 70 శాతం మొత్తాన్ని అంటే రూ.12,950 ప్రభుత్వం భరిస్తుంది. ఈ మేరకు జిల్లాలో 3 వేల మంది లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఒక్కో యంత్రం రూ.18,500 చొప్పున, 3 వేల మంది లబ్ధిదారులకు ఇచ్చే యంత్రాల విలువ రూ.5.55 కోట్లు కానుంది.
ఇందులో లబ్ధిదారులైన నేతన్నలు రూ.55.5 లక్షలు వెచ్చిస్తారు. ఇక బ్యాంకులు రూ.1.11 కోట్లు రుణంగా ఇవ్వాల్సి ఉంది. అలాగే ప్రభుత్వం రూ.3.88 కోట్లు వెచ్చించనుంది. వీటి సరఫరా బాధ్యతను ఆర్‌ఎస్‌పీజీ అనే సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. అయితే అధికారులు ఒక్కో లిఫ్టింగ్‌ యంత్రానికి రూ.18,500 ధర ఖరారు చేయడంపై నేతన్నలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ధర్మవరం, యాడికి వంటి ప్రాంతాల్లో రూ.7,500 నుంచి రూ.10 వేల లోపే మంచి లిఫ్టింగ్‌ యంత్రాలు లభిస్తాయని, వీటిని ఇక్కడే తయారుచేసి ఇస్తారని చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో రూ.18,500 ఎందుకు వెచ్చిస్తున్నారంటూ ఎక్కువ మంది నేతన్నలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ధర కావడంతో లబ్ధిదారులకు కాకుండా, సరఫరాదారుకే అధిక ప్రయోజనం దక్కుతుందని విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com