పెరుగుతున్న మిర్చి ఖర్చు

నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు మిర్చి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వానలు ఆశాజనకంగా ఉండడంతో అనేకమంది రైతులు తమ పొలాల్లో మిర్చి నారు నాటుకుంటున్నారు. స్థానికంగా నారు లేకుంటే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెప్పించుకుని మరీ నాట్లు వేస్తున్నారు. మిర్యాలగూడ డివిజన్‌లోని పలు గ్రామాల్లో మిర్చి పంటను రైతులు విరివిగా సాగు చేస్తున్నట్లు సమాచారం. అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నల్లరేగడి నేలలు ఉన్నాయి. ఈ భూములు మిర్చి పంటకు అనుకూలం కావడంతో ఈ పంటపై రైతులు మొగ్గుచూపుతున్నారు. స్థానిక రైతులు మిర్చి పంటను సాగు చేసినా నారు వేయరు. అందుకే వీరు నారు కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలపై ఆధారపడుతుంటారు. నారును గుంటూరు జిల్లా దాచేపల్లి, మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల, రెంటచింతల, నర్సారావుపేట తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తుంటారు. మిర్చి నాటడానికి తమ చేలను సిద్ధం చేసుకొని తమకు కావల్సిన నారు కోసం మిరప నారుమళ్లు పెంచేవారికి అడ్వాన్సుగా డబ్బు చెల్లిస్తారు. వర్షం ఎప్పుడైతే అనుకూలంగా పడుతుందో అప్పుడు నారు తెచ్చి నాటుతుంటామని పలువురు రైతులు చెప్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా మిర్చి నారు నాటడంలో రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కూలీల కొరత రైతులకు సమస్యాత్మకంగా మారింది.

మిర్చి నారు కొనుగోలు చేయడం, నాటడానికి సిద్ధం చేయడం ఒక ఎత్తు అయితే మిర్చి నారు నాటు వేయడం మరో ఎత్తు. ఎందుకంటే మిరప నారు నాటు వేయడానికి కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇక పలు పంటలు ఏపుగా పెరగడంతో వాటికి ఎరువులు చల్లడం, బావుల కింద వరినాట్లు వంటి వ్యవసాయ పనులు సాగుతున్నాయి. ఫలితంగా మిర్చి నాటడానికి కూలీలు లభించని పరిస్థితి నెలకొంది. పనికి ధర అధికంగా చెల్లించడానికి రైతులు సిద్ధంగా ఉన్నా కూలీలు లభించడంలేదు. దీంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నారు వేయడం ఆలస్యమైతే తిరిగి వర్షాలు కురిసే వరకు ఎదురు చూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆర్ధికంగా భారమే అయినా దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కూలీలను తీసుకొచ్చుకుని పనులు సాగిస్తున్నారు. ఇలా కూలీలను తీసుకువచ్చేందుకు ప్రత్యేక వాహనాలనూ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఇదిలాఉంటే మిర్చి రైతులకు వ్యవసాయాధికారులు పలు సూచనలు చేస్తున్నారు. నారు కొనేటప్పుడు నారుకు కాండం మచ్చ తెగులు లేకుండా జాగ్రత్తగా గమనించి కొనుగోలు చేయాలని అంటున్నారు. నారును నాటే ముందు వేర్లను క్లోరోఫైడిపాస్, కాపరాక్సిక్లోరైడ్‌ ద్రావణంలో తడపాలని దీని వల్ల చీడపీడలు ఆశించకుండా ఉంటాయని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com