గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు అంతా సిద్ధం

0

విజయనగరం జిల్లాలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2,600 ఎకరాలు సరిపోతాయని ప్రభుత్వం తేల్చింది. మిగిలిన భూములను డీ-నోటిఫై చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా పోరాటాల ఫలితంగా సర్కారు దిగొచ్చి.. డీ-నోటిఫై చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు అవసరమవుతాయని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని అమలు చేయాలని భావించింది. ప్రభుత్వం 5,311 ఎకరాల సేకరణకు 2015 ఆగస్ట్‌ 31న హడావుడిగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ జారీ చేయడంపై కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, 2016 జనవరిలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వెలువడే వరకూ రైతుల భూముల జోలికి వెళ్లొద్దని ఈ ఆదేశాల్లో పేర్కొంది. ఒకవైపు న్యాయపోరాటం, మరోవైపు సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతుల పోరాటం నేపథ్యంలో ఎకరా ఒక్కంటికీ రూ.33 లక్షల వరకూ నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. భూములివ్వని రైతులపై బెదిరింపు చర్యలకు పాల్పడింది. ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకోలేని మరికొందరు రైతులు భూములను వదులుకోవ డానికి సిద్ధపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వం 2,600 ఎకరాలను మాత్రమే సేకరించగలిగింది. మిగిలిన రైతులు భూములు ఇవ్వడానికి ముందు కు రాలేదు. కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న రైతులు కూడా తమ భూములను వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. గత నోటిఫికేషన్‌లోని 1,899.9 ఎకరాలకు విముక్తి కల్పిస్తూ డీ-నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో గూడెపువలస రెవెన్యూలో 789.69 ఎకరాలు, కవులవాడలో 730.74, కంచేరులో 301.45, ముంజేరులో 50.95, సవరవల్లిలో 27.07 ఎకరాలు ఉన్నాయి.

Share.

About Author

Leave A Reply