వరంగల్ నుంచి గ్రాండ్ మాస్టర్

14 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించిన తెలంగాణ యువ చదరంగ సంచలనం అర్జున్ ఎరిగాసిని ఐటీ మంత్రి కేటీఆర్ అభినందించారు. గురువారం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. ‘వరంగల్ నుంచి గ్రాండ్ మాస్టర్‌గా నిలిచిన 14 ఏళ్ల అర్జున్ ఎరిగాసికి హృదయపూర్వక అభినందనలు. నువ్వు ప్రపంచ విజేతగా అవతరించడాన్ని త్వరలోనే చూస్తామని ఆశిస్తున్నాను. గుడ్ లక్. నీకు ఏ విధమైన సహాయం చేయడానికైనే మేం సిద్ధంగా ఉన్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రం నుంచి గ్రాండ్‌మాస్టర్‌ అయిన తొలి క్రీడాకారుడు అర్జునే కావడం విశేషం. అబుదాబిలో బుధవారం ముగిసిన ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెస్టివల్‌, మాస్టర్స్‌ టోర్నీలో సత్తా చాటిన అర్జున్.. గ్రాండ్ మాస్టర్ హోదాను పొందాడు. ఇప్పటికే రెండు గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌లు సాధించిన అర్జున్‌.. ఈ హోదా పొందడానికి అవసరమైన మూడో నార్మ్‌ను అబుదాబి టోర్నీలోనే అందుకున్నాడు. అతను మొత్తం తొమ్మిది రౌండ్లలో ఆరు పాయింట్లు గెలిచాడు. చివరి రౌండ్లో కృష్ణతేజపై అర్జున్‌ విజయం సాధించాడు. హన్మకొండలోని షైన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అర్జున్ చదువుతున్నాడు. తెలంగాణకు చెందిన మరో చెస్‌ క్రీడాకారుడు హర్ష.. గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. అబుదాబి మాస్టర్స్‌లో మంచి ప్రదర్శన చేసిన హర్ష మూడో గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌ను సాధించాడు. అయితే అతని ఖాతాలో 2474 ఎలో రేటింగ్‌ పాయింట్లే ఉండడంతో గ్రాండ్‌మాస్టర్‌ కాలేకపోయాడు. గ్రాండ్ మాస్టర్ కావాలంటే మూడు గ్రాండ్ మాస్టర్ నార్మ్‌లను సాధించడంతో పాటు ఖాతాలో 2500 కంటే ఎక్కువ ఎలో రేటింగ్‌ పాయింట్లు ఉండాలి. కానీ హర్షకు కేవలం 26 పాయింట్ల తక్కువ ఉన్నాయి. దీంతో అతను గ్రాండ్ మాస్టర్ హోదాను పొందలేకపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com