శిథిలాల్లోనే..విధులు..

జగిత్యాలలో పలు ప్రభుత్వ ఆఫీసులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం వానలు కురుస్తుండడంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూనే విధులు నిర్వర్తిస్తున్నారు. పనులపై సదరు కార్యాలయాలకు వెళ్లినవారూ అక్కడున్నంతసేపూ భయాందోళనలకే గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్న భవంతులు పాడైనా సంబంధిత విభాగం ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టిసారించడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ సమస్య జగిత్యాలకే పరిమితం కాలేదని ఉమ్మడిజిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉందని అంటున్నారు. నాలుగు జిల్లాల్లో సుమారు 356 భవనాలు పాడయ్యాయని.. ఏక్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని దుస్థితిలో ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. పలు భవంతులు కూలిపోవడానికి రెడీ ఉన్నా వీటి విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఎడతెరపి లేని వర్షాలు కురుస్తుండటం వల్ల గంటల తరబడి వాన పడి గోడలు నానడంతో ఇవి కూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాఫీసులు సహా కొన్ని ప్రైవేటు భవనాలూ శిథిలావస్థకు చేరుకున్నాయని అంటున్నారు. ఇవి ఆకస్మాత్తుగా కూలితే నష్టం భారీగానే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే కంటే ముందుగానే ఇలాంటి భవనాలపై చర్యలు తీసుకుని.. కార్యాలయాలను మరో చోటికి తరలించేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు.

మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లా తడిసిముద్దైంది. పాతబడిన ఇళ్లు కూలుతున్న ఉదంతాలూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలతోపాటు ఇతర అన్నిరకాల భవనాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అంతా అంటున్నారు. ఎందుకంటే వానొచ్చినా వరదొచ్చినా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనులు కొనసాగుతూనే ఉంటాయి. సిబ్బంది కష్టపడి ఆఫీసులకు వెళ్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి భవనాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిందే. పాత భవనాల్లో సాగుతున్న ఆఫీసులను కొత్త బిల్డింగ్స్‌లోకి మార్చాలని పలువురు కోరుతున్నారు. ఇదిలాఉంటే కాలం చెల్లిన భవనాలపై చర్యలు తీసుకుంటేనే మేలని జిల్లావాసుల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికోసం ప్రత్యేక పరిశీలకులను నియమించి భవనాల తీరుతెన్నులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాస్తవానికి ఏదైనా భవనం కూలితే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్థి నష్టం సంభవించే అవకాశాలే ఎక్కువ. అందుకే ప్రమాదం రాకముందే అధికారులు చర్యలు మొదలుపెడితే మంచిదని పలువురు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com