కస్తూర్బాలతో వెలుగులు

పేద విద్యార్థినుల జీవితాల్లో కేజీబీవీలు వెలుగునింపుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 20 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో గంగవరం, రామకుప్పం మండలాల్లో ఉన్న కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్‌ విద్యను కూడా ప్రవేశపెట్టారు.ఈ విద్యాలయాల్లో దినచర్య అద్భుతంగా ఉంటుంది. నిత్యం వేకువజాము 4 గంటలకు బాలికలను నిద్రలేపి సుమారు గంటపాటు చదివిస్తారు. ఒక గంట పాటు యోగాసనాలు చేయిస్తారు. స్నానం, అల్పాహారం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారాన్ని అందజేస్తారు. సాయంత్రం 5 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం గంట పాటు ఆట, పాటలు, మొక్కలు సంరక్షణ వంటి పనులు చేస్తారు. రాత్రి 7 తరువాత భోజనం, అనంతరం 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్‌ వుంటాయి. నిత్యం అధ్యాపకులు ఒక పద్ధతి ప్రకారం విద్యార్థినులకు దినచర్య అమలు చేస్తారు. ఏడో తరగతి విద్యార్థినుల కోసం ఇంకో అడుగు ముందుకేసి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. దీంతో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. విద్యతో పాటు విద్యార్థినులకు మానసిక ఉల్లాసం కోసం ఆటలు కూడా ఆడిస్తున్నారు. కుట్టుపని, కంప్యూటర్‌ విద్య, చేతి పనులపై కూడా శిక్షణ ఇస్తున్నారు.విద్యార్థినులకు పౌష్టికాహారంతో కూడిన మెనూను కేజీబీవీల్లో అమలు చేస్తున్నారు. ప్రతి రోజు మూడు పూటల భోజనంతో పాటు ఉద యం, సాయంత్రం ప్రత్యేకంగా స్నాక్స్‌ను అందజేస్తున్నారు. వారానికి ఐదు రోజుల పాటు కోడిగుడ్లు, ఆదివారం చికెన్‌తో కూడిన భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు, పెన్నులు, ఏడాదికి నాలుగు జతల యూనిఫాం, బూట్లు, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు అందిస్తున్నారు. వాటితో పాటు ప్రతి నెలా సబ్బులు, తలనూనె, టూత్‌పేస్టు, కాస్మోటిక్స్‌ కూడా అందజేస్తున్నారు.విద్యార్థినులకు శారీరక సమస్యలపై అవగాహన కల్పించేందుకు 24 గంటలు ఒక ఎఎన్‌ఎం అందుబాటులో ఉంటుంది. దీనికి తోడు విద్యాలయ ఆవరణలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు,కూరగాయల తోటలను పెంచే బాధ్యతలను చిన్నారులకు అప్పగిస్తున్నారు. వాటిని విద్యార్థినులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com