అదరగొడుతున్న గీతా గోవిందం ఎంపీ కవితను కలిసిన ‘మూవీ టీం

టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితను ‘గీత గోవిందం’ టీం కలిసింది. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాం, నిర్మాత బన్నీ వాస్ హైదరాబాద్‌లోని కవిత ఇంటికి వెళ్లి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కవిత మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. రెండు సార్లు ఈ సినిమాను చూశానని, కొన్ని సన్నివేశాలు తనకు బాగా నచ్చాయన్నారు. ఈ సందర్భంగా కాసేపు వారితో కవిత ముచ్చటించారు. ‘మీరు సినిమా చూస్తారని, మమ్మల్ని ఇలా అభినందిస్తారని అస్సలు ఊహించలేదు’ అని కవితతో నిర్మాత బన్నీ వాస్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదలైన ‘గీత గోవిందం’ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనిలో షేర్ విలువ రూ.38.5 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు ‘గీత గోవిందం’ భారీ లాభాలను తెచ్చిపెట్టింది. వాస్తవానికి ఈ సినిమాకు అయిన బడ్జెట్ సుమారు రూ.14 కోట్లు. ఈ మొత్తాన్ని ‘గీత గోవిందం’ ఎప్పుడో వసూలు చేసేసింది. ఇప్పుడు లాభాలతో దూసుకెళ్తోంది. కాగా, ఓ ద్వితీయ శ్రేణి హీరోకు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కూడా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. గతంలో నాని హీరోగా వచ్చిన ‘ఎంసీఏ’ తొలి వారంలో రూ.30 కోట్లు వసూలు చేసింది. అప్పటికి ఓ ద్వితీయ శ్రేణి హీరోకి తొలి వారంలో ఇదే అత్యధిక షేర్. ఇప్పుడు ఈ రికార్డును విజయ్ దేవరకొండ బద్దలు కొట్టాడు. తొలి వారంలో ‘ఎంసీఏ’తో పోలిస్తే ‘గీత గోవిందం’ రూ.8 కోట్ల షేర్ అదనంగా వసూలు చేసింది. ఇక రేపటి నుంచి మూడు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ఈ మూడు రోజుల్లో ‘గీత గోవిందం’ మరింత వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com