కేసీఆర్ పై గద్దర్ పోటీ!?

కేసీఆర్ పై ఎన్నికల్లో పోటీ పడేందుకు బలమైన అభ్యర్థి కోసం తెలంగాణలో ప్రజాసంఘాలు గాలిస్తున్నాయి.అందులో భాగంగా ప్రజా గాయకుడు గద్దర్ ను ఒప్పించినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు 2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై బడుగుల అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ ను పోటీకి దింపాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టీ మాస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య తెలిపారు.వచ్చే ఎన్నికల్లో ఎస్సీ – ఎస్టీ – బీసీలు లేదా మహిళా అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా టీ మాస్ 119 నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఐలయ్య వివరించారు. పోటీ విషయంలో గద్దర్ ను ఇప్పటికే ఒప్పించగా.. అరుణోదయ నాయకురాలు విమలక్కను కూడా ఎన్నికల బరిలో నిలిపేందుకు ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.కాగా అగ్రవర్ణ పాలకులు బహుజనులకు బతుకుదెరువు లేకుండా చేయడాన్ని సహించలేకే ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో టీ మాస్ కూటమిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బహుజనులు రాజ్యాధికారం దక్కించుకునేలా గ్రామగ్రామానా ప్రజలను చైతన్యం చేయడంతోపాటు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నించేలా సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.అయితే.. గద్దర్ వైపు నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ ఎన్నికలలో గద్దర్ పోటీ ఖాయమని తెలుస్తున్నా. ఇలా కేసీఆర్ తో తలపడే ఆలోచన ఆయనకు ఉండకపోవచ్చని.. ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి చట్టసభలో అడుగుపెట్టాలని ఆయన కోరుకుంటున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com