కేరళలో నలుగురు పాస్టర్స్ అరెస్ట్

వివాహితపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో కేరళలోని మలన్‌కారా ఆర్థోడాక్స్ చర్చ్‌కు చెందిన ఇద్దరు మత ప్రబోధకులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫ్రాన్సిస్ అబ్రహాం వర్ఘెసే (సోనీ) తిరువళ్లా న్యాయస్థానంలో, నాలుగో నిందితుడు ఫ్రాన్సిస్ జైసే కే జార్జ్ కొల్లాం క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఫ్రాన్సిస్ జాన్సన్ వీ మాథ్యూ, ఫ్రాన్సిస్ జాబ్ మాథ్యూలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కలిసి వివాహితను లైంగికంగా వాడుకుని బ్లాక్‌మెయిల్ చేసినట్టు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. పూర్తి ఆధారాలతో సహా బాధిత మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. దీంతో ఈ కేసులో విచారణ పూర్తయినంత వరకూ మత ప్రబోధకులను మలాంకర్ ఆర్థోడాక్స్ చర్చ్ తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు 1999లో ఫాస్టర్ ఫ్రాన్సిస్ అబ్రహాం ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. అప్పటికి ఫాస్టర్‌గా శిక్షణలో ఉన్న అబ్రహాం తర్వాత మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయినా సరే ఆమెతో సంబంధం కొనసాగించాడు. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 2009లో తన కుమారుడికి బాప్టిజం నిర్వహించే సమయంలో అబ్రహాం వర్ఘెస్‌తో సంబంధాన్ని బయటపెడతానని బెదరించి మరో ప్రబోధకుడు జాన్సన్ మాథ్యూ అత్యాచారానికి పాల్పడి ఆమెను లైంగికంగా వాడుకున్నాడు. అలాగే జాబ్ మాథ్యూ కూడా తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు వెల్లడించింది. అంతేకాదు చర్చ్‌లో కౌన్సెలర్‌గా పనిచేసే మరో ప్రబోధకుడు జైసే కే జార్జ్ కూడా లైంగికంగా వేధించాడని తెలిపింది. తన కోసం ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో గది బుక్ చేసి, తనతో గడపాలని లేకపోతే మొత్తం వ్యవహారం బయటపెడతానని అతడు బెదిరించాడు. అంత సొమ్ము తన దగ్గర లేదని చెప్పినా, అప్పు తీసుకోవాలని లేదా ఇంట్లో దొంగతనం చేయాలని సలహా ఇచ్చాడని పేర్కొంది. ఇలా డిసెంబరు 2016 నుంచి తనను వేధిస్తున్నాడని వాపోయింది. దీంతో ఆ నలుగురిపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసును పోలీసులు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com