మాట మరిచారు (గుంటూరు)

ప్రణాళిక లోపం… కొరవడిన పర్యవేక్షణ… సలహా సంస్థ నిర్లక్ష్యం వెరసి వేలాది మంది రైతులకు శాపంగా మారింది. పల్నాడు ప్రాంతంలో సాగర్‌ కాలువలు, మెట్ట భూముల నుంచి వచ్చే నీరు, వర్షపు నీరు సముద్రంలోకి వెళ్లడానికి వీలుగా వాగులు ఉండగా ఇవి ప్రధానంగా నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ప్రారంభమై డెల్టా ప్రాంతం మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. అయితే మెట్ట ప్రాంతం నుంచి విడివిడిగా వచ్చే ఓగేరు, నక్క, వేదమంగళం, కుప్పగంజి, దంతెలవాగులన్నీ పెదనందిపాడు వంతెన తర్వాత కలిసిపోయి నల్లమడగా రూపాంతరం చెందుతున్నాయి. దీంతో ఈ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికితోడు డెల్టాలో మురుగునీటి కాలువలు కూడా కొన్ని ఇందులో కలవడం వరద తీవ్రత పెరగడానికి కారణమవుతోంది.
దశాబ్దాలుగా వాగు కుచించుకుపోవడం, తాత్కాలికంగా ఉపశమన చర్యలు చేపడుతున్నా శాశ్వతమైన పరిష్కారం చూపకపోవడంతో కర్షకులకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2016 సెప్టెంబరులో సంభవించిన వరద సమయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి వాగు విస్తరించి ముంపు సమస్య నివారణకు నిధులు మంజూరు చేశారు. అయితే పనులు ప్రారంభించడంలో అంతులేని జాప్యం అన్నదాతలకు ఆవేదన మిగుల్చుతోంది. వరద సమయంలో నల్లమడ కట్టలు కోతకు గురై పొలాల మీద వరద ప్రవహించి లక్ష ఎకరాల్లో పంట నష్టానికి కారణమవుతోంది. ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎక్కడో పడిన వర్షపు నీరు తమను ముంపునకు గురిచేస్తోందని ఈ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం కింద కొన్ని రూ.కోట్లు చెల్లించారేగానీ శాశ్వత పరిష్కారానికి మార్గం చూపలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు.
సముద్రం వైపు 2.6 నుంచి 39.6 కిలోమీటర్ల వరకు నల్లమడ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గతంలో సీ వాల్యూ 150 నుంచి 300 వరకు కొన్ని ప్రాంతాల్లో విస్తరించారు. 300 సీ వాల్యూ ఉన్న ప్రాంతాల్లో సైతం గరిష్ఠంగా 21,934 క్యూసెక్కులు ప్రవహించడానికి వీలవుతుంది. కొన్నిచోట్ల 150 సీ వాల్యూ కూడా లేకుండా వాగు కుచించుకుపోయింది. 2013లో వచ్చిన వరదలకు అత్యధికంగా 43,234 క్యూసెక్కుల వరద ప్రవహించగా ఎక్కడికక్కడ గండ్లు పడి పరిసర పొలాలు చెరువులను తలపించాయి. జిల్లెళ్లమూడి గ్రామం కొంత భాగం ముంపునకు గురైంది. ఈ గ్రామ వంతెన వద్ద 43,234 క్యూసెక్కుల ప్రవాహం సాగింది. మొత్తం నీరు వాగులో ప్రవహించలేక గట్లు తెగిపోయాయి. అలాగే 2016లో రేటూరు వద్ద 36,000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చినట్టు జలవనరుల శాఖ గుర్తించింది.
మేరకు దాని అడుగుభాగాన్ని 150 మీటర్ల వెడల్పుతో విస్తరించి కట్టలు బలోపేతం చేయాలి. అలా చేయడంవల్ల గరిష్ఠంగా 36,171 క్యూసెక్కుల వరద ప్రవహించడానికి వెసులుబాటు కలుగుతుంది. సాధారణంగా ఇంతకుమించి వరద వచ్చే అవకాశం లేదని, ఎప్పుడో ఒకసారి వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదని నిపుణులు సూచించారు. ఇందుకు అనుగుణంగా రూ.360 కోట్లతో జలవనరుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదించింది.
నల్లమడ విస్తరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ జనవరి 2017లో అనుమతించింది. తొలిదశలో భూసేకరణకు రూ.180 కోట్లు, డీపీఆర్‌కు రూ.60 లక్షలు విడుదల చేసింది. ఈ క్రమంలో జలవనరుల శాఖ డీపీఆర్‌ తయారీకి టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థతో 2017 ఏప్రిల్‌ 29న ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం 2017 మే 29 నాటికి నివేదిక సమర్పించాలి. అయితే ఇప్పటివరకు ఎల్‌పీ షెడ్యూళ్లు మాత్రమే తయారుకాగా డీపీఆర్‌ పనులే ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో జలవనరుల శాఖ పలుమార్లు గుత్తేదారు సంస్థకు నోటీసులు ఇవ్వగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేనందున జాప్యం జరిగిందంటూ మరికొంత వ్యవధి కావాలని కోరింది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖ సకాలంలో రికార్డులు ఇవ్వలేదని, సర్వేయర్ల కొరతతో భూసేకరణ వివరాలు రూపొందించడంలో జాప్యం జరిగిందని, గుత్తేదారు సంస్థ సిబ్బంది సర్వే చేసే క్రమంలో అనారోగ్యానికి గురయ్యారని కారణాలు చూపింది. దాంతో 2018 సెప్టెంబరు 17వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ జలవనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. అప్పటికైనా డీపీఆర్‌ తయారు చేస్తారో.. లేదో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com