వరద కష్టం..

ఆదిలాబాద్ లో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షం అపారనష్టాన్నే మిగిల్చింది. జిల్లాలో కుండపోత వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా గ్రామాలన్నీ అతలాకుతలమయ్యాయి. వరద భీభత్సం సృష్టించడంతో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బిక్కుబిక్కుమంటూ వరదలో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వచ్చింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు లోతట్టు గ్రామాలను ముంచెత్తాయి. దీంతో ప్రజలను భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులంతా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఆస్థినష్టంతో పాటూ వ్యవసాయరంగాన్నీ తీవ్రంగా ప్రభావితం చేశాయి వర్షాలు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 1.26లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనావేశారు. ఇది కాకుండా మరో తొమ్మిది శాఖల పరిధిలో 1579 నిర్మాణాలకు కలిపి రూ.52.84కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. జిల్లాలో 1,25,708 ఎకరాల్లో వేసిన వివిధ రకాలైన పంటలు నేలమట్టమైనట్లు సమాచారం. 97,547 ఎకరాలు పత్తి పంటే నీట మునిగిందని అధికారులు అంటున్నారు.
వానల ధాటికి జిల్లాలో 752 ఇళ్లు కూలిపోయాయి. గృహాలు, ఇతర నిర్మాణాలకు వాటిల్లిన నష్టం రూ.72.84లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇక రహదారులు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్రామీణ ప్రాంతాలను కలిపే 77 పంచాయతీరాజ్‌ రహదారులు వర్షాలతో ధ్వంసమయ్యాయి. రూ.19.94కోట్లు వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంటున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరించిన, కొత్తగా నిర్మించిన చెరువులు సైతం ప్రభావితమయ్యాయి. సుమారు 31 చెరువులకు నష్టం వాటిల్లింది. ఇదిలాఉంటే జిల్లాలోని 18 మండలాల్లో 13 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అందులో 1,272 కుటుంబాలు, 3,900 మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన చోట పునరావాస కేంద్రాల నుంచి ప్రజలను గ్రామాలకు తరలించి శిబిరాలను ఎత్తేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురియడంతో ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరకులు, దుస్తులు, ఇతర సామగ్రి తడిసి ముద్దయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. అధికారులు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించారు. వర్షం, వరదలు ఆదిలాబాద్ కు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ కష్టం నుంచి తేరుకునేందుకు కొన్ని నెలలు పడుతుందని స్థానికులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com