కమలంలో తప్పని కుమ్ములాటలు

0

భారతీయ జనతా పార్టీలో టికెట్ల పంచాయితీ రోజురోజుకూ ముదురుతోంది.ఇప్పటికే రెండు దఫాలుగా ప్రకటించిన జాబితాల్లో చోటు దక్కని నాయకులు పార్టీ అధిష్టానం పట్ల, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తీరుపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే రెండు జాబితాల్లోనూ తమ పేరు ఉండకుండా చేశారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. టికెట్ దక్కని నేతలు పార్టీ కార్యాలయం ఎదుట, రాష్ట్రపార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనలకు దిగుతున్నారు.వీరిని బుజ్జగించడం కమలం నాయకులకు తలనొప్పిగా మారింది. కొందరు కొత్త నాయకులకు, ఈ మధ్య పార్టీలో చేరినవారికి టికెట్లు కేటాయించిన అధిష్టానం, చాలా ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా తమకు ఎందుకు ఇవ్వలేదంటూ నాయకులు నానా రచ్చ చేస్తున్నారు. ఈ సీట్ల పంపకం బీజేపీ నేతలకు, నాయకులకు తలకు మించిన భారం అవుతుంది. రాష్ట్రంలో 65 నుంచి 70 సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీకి.. టికెట్ల పంచాయితీ పెద్ద ఆటంకంగా మారింది.ఒకరికి సీటు కేటాయిస్తే మరొకరు పార్టీ నుంచి దూరమయ్యేందుకు సిద్ధమైపోతున్నారు. వారిని బుజ్జగించలేక, టికెట్ ఇవ్వలేక ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర నేతలు కొట్టుమిట్టాడుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, నగరంలోని ప్రధానమైన సికింద్రాబాద్ సీటు విషయంలో మాత్రం బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. కానీ సికింద్రాబాద్ టికెట్ తనకే అంటూ ఆశలు పెట్టుకున్న బండేపల్లి సతీష్ గౌడ్ మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. వాడ వాడల తిరుగుతూ తనకు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు అందరిని ఒకటి చేసి బీజేపీ గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.అయినా బండేపల్లికి ఇప్పటివరకు టికెట్ కేటాయించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వినాయకచవితి మొదలు ఇప్పటివరకు ఏదో ఓకార్యక్రమం చేపడుతూ ప్రజల్లో ఉండేందుకు సతీష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు దఫాలుగా రాష్ట్ర కేంద్ర నాయకులను పిలిచి సమావేశాలు సైతం పెట్టారు. అదీగాక బండేపల్లి సతీష్ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ ఉపాధ్యక్షుడిగాను పనిచేస్తున్నారు. అయినా ఆయన విషయంలోనూ పార్టీ పెద్దలు టికెట్ కేటాయించడానికి వెనకాముందు ఆలోచించడం లేదని వినిపిస్తోంది. తనకు టిక్కెట్ రాకపోతే పరిస్థితి ఏంటని బండేపల్లి పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఆయన అనుచరులు కూడా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు జాబితాల్లోను బండేపల్లి పేరు కనిపించలేదు. దీంతో నిన్న మొన్నటి వరకు ఉత్సాహంగా ప్రచారం చేసుకున్న ఆయన ఈ పరిణామాలతో నెమ్మ దించారు. ఇన్నాళ్లు సికింద్రాబాద్ సీటు బండేపల్లి కంటూ పార్టీలోని పెద్ద నేతలు హామీ ఇచ్చారని, ఏం జరిగిందో ఏమో కానీ విడుదల చేసిన రెండు జాబితాల్లో ఆయన పేరు లేకపోవడం పట్ల ఏదో జరుగుతుందన్న సందేహాలు కలుగుతున్నాయని బీజేపీ సికింద్రాబాద్ నేతలు చర్చించుకుంటున్నారు.సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఇన్నాళ్లు బండేపల్లి పేరు వినిపించినా, కొత్తగా మరో యువ నాయకుడు ప్రవీణ్ చంద్ర పోటీలోకి వచ్చాడని, ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే గతవారం ప్రవీణ్ చంద్ర పార్టీ పెద్దలను, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను కలిసి వచ్చినట్లు సమాచారం. ఆయనకు కేంద్రమంత్రి గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆశీస్సులు కూడా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.అందుకోసమే సికింద్రాబాద్ సీట్ విషయంలో బిజెపి రాష్ట్ర పెద్దలు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఖర్చు చేసుకున్న బండేపల్లి సతీష్ కు ఇవాళ, లేదా ఆరెస్సెస్, బిజెపి పెద్దల ఆశీస్సులు ఉన్న యువ నాయకుడు పవన్ చంద్రకు ఇవ్వాలా అణా దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే బండేపల్లి అభ్యర్ధిత్వం విషయంలో వెనక ముందు ఆడుతున్నట్లు సమాచారం.ఒకవేళ అదే జరిగితే ఇన్నాళ్లు నియోజకవర్గంలో తిరిగి అందరినీ కూడగట్టుకున్న బండేపల్లి పరిస్థితి ఏంటన్నది ఆయన అనుచరులు లేవనెత్తుతున్న ప్రశ్న. టికెట్ విషయంలో ముందే క్లారిటీ ఇచ్చి, తీరా ఇప్పుడు పేరు ప్రకటించకపోవడం ఏంటని సతీష్ వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు.నిన్న మొన్నటి వరకు టిఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి పద్మారావుకు ధీటుగా ప్రచారంలో దూసుకుపోయిన బిజెపి నాయకుడు బండేపల్లి సతీష్ గౌడ్ ఇప్పుడు డీలా పడిపోయారు. టికెట్ తనకే వస్తే పద్మారావు ను ఓడించి సికింద్రాబాద్ లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమాతో ఉండేవారు. కానీ ఇప్పటికీ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అనుచరులతో పాటు ఆయన కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనకు వెంటనే టికెట్ కేటాయించాలని ఆయన కోరుతున్నారు. తమ నాయకుడికి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామంటూ ఆయన అనుచరులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిణామాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలా తీసుకుంటుందో చూడాలి.

Share.

About Author

Leave A Reply