ఉత్తుత్తి విత్తనం (నిజామాబాద్)

జిల్లాలో విత్తనోత్పత్తి పథకం అపహాస్యమవుతోంది. అధికారుల అలసత్వంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ప్రైవేటు కంపెనీల నకిలీ విత్తనాల నుంచి బయటపడేందుకు ప్రభుత్వంపై ఆధారపడితే నిండా మునిగిపోతున్నారు. మొలకెత్తని సోయా విత్తనాలు పంపిణీ చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. శాస్త్రవేత్తల సూచనలను విస్మరించి తాడ్వాయి మండలంలోని 15 గ్రామాల్లో మూల విత్తనాలు పంపిణీ చేశారు. గ్రామానికి యూనిట్‌(యూనిట్‌ అనగా 25 ఎకరాలు) చొప్పున 375 ఎకరాల్లో విత్తారు. పది రోజులు దాటినా మొలకెత్తలేదు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. అయినా అధికారులు కళ్లు తెరవకుండా బదులుగా మరో సంచి విత్తనాలు అందిస్తామని చెబుతుండటం గమనార్హం. మండలంలో మొలకెత్తని సోయా విత్తనాల పంపిణీతో రైతులు సుమారు రూ.20 లక్షల పెట్టుబడి నష్టపోయారు. దుక్కి దున్నడంతో పాటు విత్తనాలు విత్తేందుకు ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వ్యయం అవుతోంది. యంత్రం ద్వారా సోయా విత్తనాలు విత్తేందుకే ఎకరాకు రూ.800 ఖర్చు చేశారు. ప్రస్తుతం కాలం దాటిపోవడంతో ఈ ఏడాది పంట పండించే అవకాశం కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాల్తుమ్మెద, బొప్పాస్‌పల్లి విత్తనోత్పత్తి క్షేత్రాల్లో సోయా విత్తనోత్పత్తి ప్రారంభించే ముందు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, రుద్రూరు కృషి విజ్ఞాణ కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు నిర్వహించారు. ఉభయ జిల్లాల్లోని నేలలు సోయా విత్తనోత్పత్తికి అనుకూలంగా లేవని తేల్చారు. ఫౌండేషన్‌సీడ్‌(ఎఫ్‌ఎస్‌-1)కు సాధారంగా మొలకెత్తే శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడి నేలల్లో తేమ శాతం ఇతర ప్రాంతాల కంటే తక్కువగా ఉండటం వల్ల మొలకెత్తే శాతం కనిష్ఠ స్థితిలో ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రాంత నేలల్లో ఎఫ్‌ఎస్‌-2 విత్తనాలను మాత్రమే విత్తుకోవాలని సూచించారు. అయినా అధికారులు వినిపించుకోకుండా విత్తనోత్పత్తి క్షేత్రాల్లో రెండేళ్లపాటు సోయా విత్తనోత్పత్తి పంటలను సాగు చేశారు. అనంతరం జర్మినేషన్‌ పరీక్షలు నిర్వహించగా విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రూ.లక్షలాది ప్రజాధనం వృథా అయింది.
నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా ఫౌండేషన్‌ సీడ్‌(మూల విత్తనం)ను ఆదర్శ రైతులకు 50శాతం రాయితీపై అందిస్తారు. నాణ్యమైన విత్తనోత్పత్తి చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అందించాల్సి ఉంటుంది. వీరు పండించిన విత్తనోత్పత్తి పంటను స్థానికంగా ఉండే రైతులు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
సోయాబీన్‌ మూల విత్తనాలు నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ కంపెనీ ద్వారా సరఫరా అయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విత్తనాల్లో 70 శాతం వరకు మొలకెత్తే పరిమాణం ఉంటుందని, ఎందుకు మొలకెత్తలేదో తెలవడం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలే మొలకెత్తకపోతే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నష్టపోయినవారికి ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com