నకి’లీలలు’

ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు నకిలీ పురుగుమందులు అంటగడుతూ పలువురు వ్యాపారులు జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతన్నల అమాయకత్వం, అవగాహనలేమిని క్యాష్ చేసుకుంటూ సదరు వ్యాపారులు ఈ తరహా దందా సాగిస్తున్నారని అంటున్నారు. పంటలకు సోకే తెగుళ్ల నివారణకు ఏ మందు వాడితే ఫలితం ఉంటుందనే విషయాలు రైతులకు పెద్దగా తెలీవు. ఇదే అదనుగా పలువురు వ్యాపారులు నకిలీ పురుగుమందులను అంటగట్టేస్తున్నారు. ఈ మందులతో తెగుళ్లు నాశనమవుతాయని నమ్మబలుకుతూ రైతులను ఆర్ధికంగా దెబ్బతీస్తున్నారు. దీంతో పాటు పంటలకు ఏ మాత్రం ఉపయోగం లేని మందులు సైతం అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో నకిలీ పురుగు మందుల అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం దృష్టిసారించి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. జైనథ్‌ మండలంలో పలువురు కర్షకులు ఇప్పటికీ నకిలీ మందులు కొని నష్టపోయారు. వ్యాపారులు మాయమాటలు నమ్మి మోసపోయామని వారు దిగులుపడుతున్నారు. వందలు వెచ్చించినా పంటలకు సోకిన తెగుళ్లు వదిలిపోలేదని వాపోతున్నారు.
ఆదిలాబాద్‌ వ్యాప్తంగా ఈ ఏడాది 4.82 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు రైతులు. ప్రస్తుతం పంటలు ఏపుగా పెరుగుతున్నాయి. ఈ దశలో పురుగుల ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. తెగుళ్ల నివారణకు రైతులు పలు రకాల మందులు పిచికారీ చేయడం సాధారణం. అయితే పురుగు మందులపై వీరికి సరైన అవగాహనలేదు. వ్యాపారులపైనే పలువురు ఆధారపడుతూ వారు చెప్పిన మందులను వినియోగిస్తున్నారు ఎక్కువమంది రైతులు. ఇక కలుపు నివారణకూ మందులు పిచికారీ చేస్తుంటారు. పత్తి పంటలో కలుపు నివారణకు వాడే గ్లైసోఫేట్‌ మందును కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే ఈ మందు జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. మొత్తంగా నకిలీలతో పాటూ నిషేధిత మందులూ కర్షకుల చేతికి అందుతున్నాయి. ఇలాంటి మందులతో ఆర్ధికంగానే కాక ఆరోగ్యపరంగానూ నష్టపోతున్నారు రైతులు. వ్యాపారులు అంటగడుతున్న మందుల్లో కొన్ని ఏవి అసలు, ఏవి నకిలీవో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ విషయాన్ని కొంత మంది రైతు సంఘాల నాయకులు జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకుపోగా, దుకాణాలను తనిఖీలు చేయాలని ఆదేశించింది. అధికారులు రెండు రోజులుగా పలు దుకాణాలను తనిఖీలు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పలు షాపుల్లో నకిలీ మందులు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి మందులు విక్రయిస్తున్నవారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అనుమతులు లేని మందుల అమ్మకాలను నిలిపి వేయాలని ఆదేశించారు. గ్రామాలకు వచ్చి అమ్మే మందులను కొనుగోలు చేయద్దని రైతులకు స్పష్టంచేశారు. తెగుళ్ల నివారణకు వినియోగించే మందుల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com