తలక్రిందులైన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్

0

Star Cast: అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతీమా సనా షేక్, రోనిత్ రాయ్

Director: విజయ్ కృష్ణ ఆచార్య

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుంది. దానికి తోడు అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, దంగల్ ఫేమ్ ఫాతీమా సనా షేక్ లాంటి తారాగణం ఉంటే అంచనాలు మరింత పెరుగుతాయి. ఇలాంట నటీనటులు, యష్ రాజ్ ఫిలిం బ్యానర్, ధూమ్ 3 ఫేమ్ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య లాంటి కలయికతో దీపావళీ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. నవంబర్ 8న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ రికార్డులను తిరగరాసే సత్తా ఉందా? అమీర్, అమితాబ్ తదితర నటులు తమ నటనతో ప్రేక్షకులను రంజింప చేశారా అనే తెలుసుకోవాలంటే సినిమా కథ, కథనాల గురించి చర్చించాల్సిందే.

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ కథ:రౌనాక్‌పూర్ సంస్థానధీషుడు మీర్జా సాబ్ (రోనిత్ రాయ్)ని వ్యాపారం పేరుతో స్నేహ హస్తం అందించి ఈస్ట్ ఇండియా కంపెనీ అధినేత జాన్ క్లైవ్ (లాయర్ ఓవెన్) వెన్నుపోటు పొడుస్తాడు. మీర్జా కుటుంబాన్ని హతమారుస్తాడు. ఆ వెన్నుపోటు ఘటనలో మీర్జా కూతురు జహీరా (ఫాతీమా సనా షేక్)ను సైన్యాధ్యక్షుడు కుదాభక్ష్ ఆజాద్ (అమితాబ్ బచ్చన్) కాపాడి పెద్ద చేస్తాడు. తమ సంస్థానాన్ని చేజిక్కించుకునేందుకు కుదాబక్ష్, జహీరాలు పోరాటం చేస్తుంటారు. ఇక బ్రిటీష్ పాలకులకు భారత పోరాట యోధుల సమాచారం అందిస్తూ ఫిరంగీ మల్లా వారికి బానిసగా వ్యవహరిస్తుంటాడు. కుదాభక్ష్‌ను పట్టిస్తే భారీగా నజరనా ఇచ్చేలా ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంటాడు. ఓ ప్లాన్ ప్రకారం కుదాభక్ష్ సేనను ముగ్గులోకి దించి కంపెనీకి అప్పగిస్తాడు. ఆ ఘటనలో కుదాభక్ష్ ప్రాణత్యాగానికి సిద్ధపడుతాడు. తమను మోసం చేసిన ఫిరంగిని మరోసారి నమ్మి జహీరాను సంరక్షణ బాధ్యతను అతడికి అప్పగిస్తాడు.

కథలో ట్విస్టులు:

 ఈస్ట్ ఇండియా కంపెనీకి చిక్కిన కుదాభక్ష్ సైన్యం తప్పించుకొన్నాదా? కంపెనీకి తొత్తుగా వ్యవహరించే ఫిరంగీ మల్లాలో ఏదైనా మార్పు వచ్చిందా? జహీరా సంరక్షణ బాధ్యతను చేపట్టిన ఫిరంగీ ఎలాంటి ప్రభావాలకు లోనయ్యాడు? ప్రాణత్యాగానికి సిద్ధపడిన కుదాభక్ష్ పరిస్థితి ఏమైంది. ఈ కథలో డ్యాన్సర్ సురయ్యా (కత్రినా కైఫ్) పాత్ర ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీని ఎలా ఎదురించి తమ సంస్థానాన్ని చేజిక్కించుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్ర కథ.

ఫస్టాఫ్ విశ్లేషణ:

 మీర్జా సాబ్ కుటుంబంపై ఈస్ట్ ఇండియా కంపెనీ దాడితో కథ మొదలైవుతుంది. జాన్ క్లైవ్ చేతిలో మరణ ముప్పు ఉన్న జహీరాను ఆజాద్ కాపాడే అంశంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత సురయ్యా పాత్ర, అమీర్ ఖాన్ పాత్రలను ఎంటర్‌టైన్ మెంట్ రూపంలో చేసిన పరిచయంతో కొంత వినోదంతో సరదాగా సాగుతుంది. తొలిభాగంలో బలమైన సన్నివేశాలు లేకపోవడంతో కథ నత్తనడకన సాగినట్టు కనిపిస్తుంది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో అమితాబ్‌‌కు సంబంధించిన ఓ ట్విస్ట్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది.

సెకండాఫ్ విశ్లేషణ:

 సెకండాఫ్‌లో అమీర్ ఖాన్ చిలిపి నటన, ఎత్తులు పైఎత్తులు ఆకర్షణగా మారాయి. కానీ కథలో వేగం లేకపోవడం ప్రేక్షకుడికి విసుగుపుట్టిస్తుంది. గ్రాఫిక్స్, సౌండ్, సినిమాటోగ్రఫి లాంటి అంశాలు కొంత మేరకు ప్రేక్షకుడిని కథలో లీనం కావడానికి తోడ్పాటునందిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో అమితాబ్‌కు సంబంధించిన ఓ ట్విస్టు ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అయితే పసలేని సీన్ల కారణంగా ఆ ఉత్సాహం ఎక్కువు సేపు నిలువదు. క్లైమాక్స్‌లో ఓ మోస్తారు ముగింపుతో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌కు తెరపడుతుంది

అమితాబ్ నటన

అమితాబ్ నటన కుదాభక్ష్ ఆజాద్‌గా అమితాబ్ బచ్చన్‌ పాత్ర ఈ సినిమాకు వెన్నుముకలాంటింది. తొలిభాగంలో నటనతో బిగ్‌బీ ఆధిపత్యం కొనసాగించాడు. చాలా కాలం తర్వాత ఫైట్స్, యాక్షన్ సీన్లలో కనిపించి యాంగ్రీ మ్యాన్‌గా మారాడు. కీలక సన్నివేశాల్లో అమితాబ్‌ నటన అద్భుతంగా ఉంటుంది. బరువైన పాత్రలో, సినిమాను భుజాన వేసుకొని పాత్రలో అమితాబ్ కనిపించడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి.

అమీర్ ఖాన్ యాక్టింగ్ :

ఫిరంగీ మల్లాగా అమీర్ ఖాన్ నెగిటివ్ షేడ్స్ ఉండే అల్లరి, చిలిపి పాత్రలో కనిపించాడు. కొన్ని సీన్లలో చిలిపి చేష్టలు, జిత్తుల మారి నటనతో అమీర్ ఆకట్టుకొంటాడు. తొలిభాగంలో అమీర్ కథకు సపోర్టివ్‌గా నిలువగా, రెండోభాగంలో అంతా తానై నిలిచాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో అమీర్ తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడని చెప్పవచ్చు. పీకే, దంగల్ లాంటి సినిమాలు ఊహించుకొని థియేటర్ వస్తే అమీర్ నిరాశపరుస్తాడు.

ఫాతీమా సనా ఫెర్ఫార్మెన్స్:

 దంగల్ తర్వాత ఫాతీమా సనా షేక్‌కు మరోసారి పూర్తిస్థాయి నటనను ప్రదర్శించే పాత్ర దొరికింది. ఈస్ట్ ఇండియా కంపెనీ మోసానికి కుటుంబాన్ని కోల్పోయి, కంపెనీపై ప్రతీకారం తీర్చుకొనే యుద్ధనారీ పాత్రలో జహీరాగా కనిపించింది. ఈ చిత్రంలో పూర్తి నిడివి కల పాత్ర. ఆమె చుట్టే కథ తిరగడం, అందుకు తగినట్టే మంచి నటనను కనబరచడంతో మంచి మార్కులే పడే అవకాశం ఉంది. నటిగా ఫాతీమాను మరో మెట్టు ఎక్కించే చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్.

కత్రినా కైఫ్ గ్లామర్ సరయ్యా అనే డ్యాన్సర్ పాత్రలో కత్రినా కైఫ్ కనిపించింది. పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రే అనిచెప్పవచ్చు. కత్రినా అందాల ఆరబోతకు, ఆటపాటలకే పరిమితమైంది. అమీర్‌కు జోడిగా నటించినప్పటకీ.. అప్పుడప్పుడు కనిపించే అతిథి పాత్రలో అలరించింది.

మిగితా పాత్రల్లో :

అమీర్, అమితాబ్, ఫాతీమా, కత్రినా పాత్రలు మినహాయిస్తే పెద్దగా ఆకట్టుకొనే పాత్రలు కనిపించవు. ప్రధాన విలన్ జాన్ క్లైవ్ పాత్ర చాలా బలహీనమైనదే. రోనిత్ రాయ్, ఇతర పాత్రలు పెద్దగా దృష్టికి వచ్చేవి కావు. చాలా పాత్రలే ఉన్న నాసిరకమైన నటులతో పనికానిచ్చేశారు.

ఆకట్టుకోలేకపోయిన మ్యూజిక్ :

టెక్నికల్ విషయాలకు వస్తే సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది. రీరికార్డింగ్ కూడా నామమాత్రంగానే ఉంది. సన్నివేశాలను ఎలివేట్ చేయాల్సిన చోట మ్యూజిక్ విఫలమైంది. ఎడిటింగ్ విభాగం పనితీరు కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది. గ్రాఫిక్స్ వర్క్ ఈ సినిమాను నిలబెట్టింది.

సినిమాటోగ్రఫీ:

 థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రానికి సినిమాటోగ్రఫి హైలెట్. సముద్రంలోని షూట్ చేసిన సీన్లు హాలీవుడ్ ప్రమాణాలను కలిగి ఉన్నాయి. లైటింగ్ వాడుకొన్న విధానం బాగున్నది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్:

 యష్ రాజ్ ఫిలింస్‌ బ్యానర్ నుంచి వచ్చే సినిమాపై సహజంగానే అంచనాలు పెరుగుతాయి. అందులో పిరియాడిక్ ఫిలిం అనగానే అంచనాలు మరింత పెరిగాయి. అయితే చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌ను రూపొందించడంలో యష్ రాజ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సాంకేతిక విభాగాల ఎంపిక విషయంలో దారుణంగా తప్పటడుగులు వేసింది. వెరసి థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ నాసిరకమైన సినిమాగా రూపొందింది.

బ్రిటిష్ పరిపాలనకు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ‌ని ఎదురించిన:

 పోరాటయోధుల కథా నేపథ్యంగా రూపొందించిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ మినహా స్క్రిప్టులో బలం లేకపోవడం నిరాశపరిచే అంశం. బలమైన సన్నివేశాలు, ఆసక్తికరంగా కథనం కనిపించవు. అందమైన లొకేషన్లు, సెట్లు, గ్రాఫిక్ వర్క్, మేకింగ్ ఈ సినిమాకు బలంగా నిలిచాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే అంశాలు పెద్దగా కనిపించవు. ఒకవేళ దిగువ స్థాయి ప్రేక్షకుల ఆదరణ పొందడంపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. స్టార్ హీరోల కారణంగా తొలి వారం భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

తెర ముందు, తెర వెనుక :

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతీమా సనా షేక్, లాయిడ్ ఓవెన్, దర్శకత్వం: విజయ్ కృష్ణ ఆచార్య నిర్మాత: ఆదిత్య చోప్రా మ్యూజిక్: అజయ్ అతుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జాన్ స్టీవార్ట్ ఎడ్యూరి సినిమాటోగ్రఫి: మనుష్ నందన్ ఎడిటింగ్: రితేష్ సోని బ్యానర్: యష్ రాజ్ ఫిల్మ్స్ రిలీజ్: 2018 నవంబర్ 8

Share.

About Author

Leave A Reply