కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే మొదటిది కంటి వైద్యం కోసం ఏ ఒక్కరూ రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేదు మల్కాపూర్‌లో ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించినసిఎం కేసీఆర్‌

కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే మొదటి ప్రయత్నం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కంటి వైద్యం కోసం ఏ ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.‘‘కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే ఎప్పుడూ.. ఎక్కడా చేయని ప్రయత్నం. ఈ కార్యక్రమం వల్ల లక్షలాది మందికి ఉపయోగంగా ఉంటుంది. మనిషి జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. 3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తాం. అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలను కూడా ప్రభుత్వమే చేయిస్తుంది. కంటి వైద్యం కోసం ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేదు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తాం. ఇప్పటికే 40 లక్షల కళ్లద్దాలను తెప్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా 825 బృందాలను నియమించాం. స్వయంగా నేనే కొందరికి కళ్లద్దాలు అందజేశాను. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోం చేసుకోవాలి’’ అని ప్రజలకు సూచించారు.మల్కాపూర్‌ మంచి గ్రామం అని ముఖ్యమంత్రి కొనియాడారు. గ్రామాన్ని చూసి తానే ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. కులాలు, మతాలు అడ్డుగోడలు లేకుండా చూడాలని గ్రామస్థులకు పిలుపునిచ్చారు. ఆడ, మగ అనే తేడాలు ఉండకూడదని సూచించారు. మహిళలను చిన్నచూపు చూడకూదని, మద్యం మహమ్మారిని మళ్లీ గ్రామంలోకి రాకూండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. మల్కాపూర్ నుంచి నేను ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మల్కాపూర్‌కు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆడ,మగ అంతరాలు కేవలం మన దేశంలోనే ఉన్నయి. అవకాశాలిస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం స్పష్టం చేశారు.అంతకుముందు కంటి వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి కొంతమందికి కళ్లద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్,కేశవరావు, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలుఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com